TDR Bonds: తిరుపతి కార్పొరేషన్‌కు రూ.150 కోట్ల నష్టం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

టీడీఆర్‌ బాండ్ల పేరిట భారీ దోపిడీ
వైకాపా హయాంలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో నిర్మించిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారి 

ఈనాడు, తిరుపతి: మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల పేరిట తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నేతలు అస్మదీయులకు అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు కట్టబెట్టడం ద్వారా కార్పొరేషన్‌ ఖజానాకు రూ.150 కోట్ల నష్టం చేసినట్లు తేల్చింది. త్వరలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి అందనుంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి,  అతని కుమారుడు, నాటి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి ఈ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలున్నాయి. తిరుపతిలో 104 మాస్టర్‌ప్లాన్‌ రహదారులు నిర్మించాలని ప్రతిపాదించిన నాటి పాలకులు.. 2024 ఎన్నికలకు ముందు 23 రోడ్ల పనులు చేపట్టారు. ఇందుకోసం 1,389 ఆస్తులను సేకరించారు. 1,149 ఆస్తులే టీడీఆర్‌ బాండ్ల జారీకి అర్హమైనవి కాగా, అప్పట్లోనే 442 బాండ్లు ఇచ్చేశారు. మరో 707 ఇవ్వాలి.

ఈ బాండ్ల జారీలో కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డి తమ స్వప్రయోజనాలతో పాటు అనుచరులకు అనుచిత లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న అభియోగాలున్నాయి. భూమి/ ఆస్తిని నివాసిత ప్రాంతం (రెసిడెన్షియల్‌ ఏరియా)లో కోల్పోగా, వాణిజ్య ప్రాంతం (కమర్షియల్‌)లో కోల్పోయినట్లు తప్పుడు రికార్డులు రాయించారు. కార్పొరేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే వైకాపా నేతల ఒత్తిడి మేరకు బాండ్లు జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్‌ అధికారులు సర్వేయర్లతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి, ఆస్తుల విలువను లెక్కగట్టారు. మొత్తం రూ.850 కోట్ల విలువైన 442 టీడీఆర్‌ బాండ్లను జారీ చేయగా, వీటి వాస్తవిక విలువ రూ.700 కోట్లేనని విజిలెన్స్‌ పరిశీలనలో తేలింది. ఖజానాకు రూ.150 కోట్ల మేరకు నష్టం చేస్తున్నట్లు సమాచారం. భూముల విలువ పెంచడంపై సబ్‌రిజిస్ట్రార్లను వివరణ కోరినట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్‌ సైతం ఈ వ్యవహారంపై సమాంతరంగా విచారణ జరుపుతోంది.

Tags :
Published : 04 Jan 2025 04:35 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని