AP Cabinet: లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు.

Updated : 15 Jun 2024 06:52 IST

పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి
కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత
లోకేశ్‌కు విద్య, ఐటీ
పయ్యావులకు ఆర్థికం
అచ్చెన్నకు వ్యవసాయం
అనితకు హోం
నారాయణకు పురపాలకం
మనోహర్‌కు పౌరసరఫరాలు
సత్యకుమార్‌కు వైద్యం
మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం
ఈనాడు - అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కీలకమైన మానవ వనరుల అభివృద్ధి (విద్యా శాఖ), ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖల్ని అప్పగించారు. శాఖల కేటాయింపులో సీనియర్లకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

‘అమరావతి’ బాధ్యత నారాయణకు

2014-19 మధ్య పురపాలకశాఖ మంత్రిగా, రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన పి.నారాయణకు ఊహించినట్లుగానే మళ్లీ అదే శాఖను కేటాయించారు. రాజధాని భూసమీకరణ, డిజైన్లు, ఆకృతుల రూపకల్పన మొదలు, వాటి అమలు వరకు ప్రతి అంశంపైనా ఆయనకు అవగాహన, లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. రాజధాని నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించేందుకు ఆయన అనుభవం ఎంతగానో దోహదం చేస్తుంది. పురపాలకశాఖపైనా నారాయణ గతంలో తనదైన ముద్ర వేశారు.

కేశవ్‌కు ఆర్థిక వ్యవస్థ మరమ్మతు బాధ్యతలు

సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌కు ఊహించినట్టుగానే ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖలు దక్కాయి. సమయస్ఫూర్తి, చాతుర్యం, ధాటిగా మాట్లాడగల నైపుణ్యంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చింది. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా చక్కదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కేశవ్‌పై ఉంది. మంత్రివర్గంలో అత్యంత సీనియర్‌ అయిన ఆనం రామనారాయణరెడ్డికి గౌరవప్రదమైన దేవాదాయశాఖను కేటాయించారు. కొల్లు రవీంద్రకు కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖలు దక్కాయి. ఆయనకు గత తెదేపా ప్రభుత్వంలోనూ ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 

 రామానాయుడికి జలవనరుల శాఖ

కీలకమైiన జలవనరులశాఖను నిమ్మల రామానాయుడికి కేటాయించారు. గత పదేళ్లలో పార్టీలో అత్యంత క్రియాశీలంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. ముఖ్యంగా ఐదేళ్ల వైకాపా పాలనలో శాససభలోనూ, బయటా గట్టిగా పోరాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే పోలవరం ప్రాజెక్టుపై అదే జిల్లాకు చెందిన రామానాయుడికి లోతైన అవగాహన ఉంది. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిన పెట్టడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించాల్సిన బృహత్తర బాధ్యతను చంద్రబాబు ఆయనపై ఉంచారు. 

 అనితకు హోం శాఖ

తెలుగు మహిళ అధ్యక్షురాలిగా గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ అరాచకాలపై గట్టిగా పోరాడి, ఫైర్‌బ్రాండ్‌ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న వంగలపూడి అనితకు కీలకమైన హోం శాఖ దక్కింది. ఆమె ప్రతిభను గుర్తించి పార్టీ పెద్ద బాధ్యత అప్పగించింది. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, అవకతవకల్ని తవ్వి తీసి, కేసులు పెట్టాల్సిన బాధ్యత హోం శాఖపై ఉంది. వాటన్నిటినీ అనిత స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉంది. 

 ‘ఇంటి’ని చక్కదిద్దాల్సింది పార్థసారథే

మరో సీనియర్‌ నేత కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణశాఖ కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం పథకం అత్యంత గందరగోళంగా ఉంది. వారికి స్థలాలు కేటాయించిన కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని సంస్కరించడం ఆయనపై ఉన్న అతి పెద్ద బాధ్యత.

  • మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన అనగాని సత్యప్రసాద్‌కు కీలకమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలను కేటాయించారు. 
  • గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్‌ శాఖ అప్పగించారు. ఆ శాఖలో చేయాల్సింది, సంస్కరించాల్సింది చాలా ఉంది. 
  • ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లకు కీలక శాఖలు దక్కాయి. బీసీ జనార్దన్‌రెడ్డికి రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖను కేటాయించారు. టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖలు కట్టబెట్టారు. 
  • డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమంతో పాటు, కీలకమైన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల శాఖను కేటాయించారు. దానిలో చాలా సంస్కరణలు తేవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆయనపై బృహత్తర బాధ్యత ఉంది. 

మిత్ర ధర్మాన్ని పాటించిన తెదేపా

శాఖల కేటాయింపులో తెదేపా మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు, అదే పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీరంగంతో ఉన్న సంబంధాలు, పవన్‌ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. భాజపా నుంచి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న సత్యకుమార్‌కు వైద్యం, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖను అప్పగించారు.


పవన్‌ ఒక్కరే డిప్యూటీ సీఎం

మిత్రపక్షం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖల్ని అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను తెదేపాకు చెందిన సీనియర్‌ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు.  పవన్‌ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకే కేటాయించారు. తనకు ప్రత్యేక గుర్తింపు, సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉపముఖ్యమంత్రిని చేస్తూ, కీలకశాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్‌ అభిమతాన్ని తెలుసుకున్న తెదేపా నాయకత్వం దానికి తగ్గట్టుగా వ్యవహరించింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా.. ఈ దఫా పవన్‌ ఒక్కరినే ఉపముఖ్యమంత్రిని చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా ఆ శాఖను ఏరికోరి తీసుకున్నారు. ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ, పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.


సవాళ్లున్నా.. పట్టుదలతో విద్యాశాఖను ఎంచుకున్న లోకేశ్‌ 

విద్యాశాఖను నిర్వహించడం అత్యంత సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. విద్యారంగంలో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఆ శాఖను సమర్థంగా నిర్వహించడం ఆషామాషీ కాదని చాలా మంది సూచించినా... లోకేశ్‌ పట్టుదలతో ఆ శాఖ బాధ్యతల్నే తీసుకున్నారు. విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించాలన్నది ఆయన అభిమతం. కొత్త విద్యా సంస్థల్ని తీసుకురావడం, ఉన్నవాటిని బాగు చేయడం, అక్షరాస్యతను పెంచడం... వంటి చర్యల ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తేవాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నట్టు సమాచారం. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడంతో పాటు, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన దస్త్రంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడం విద్యారంగానికి తెదేపా ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. లోకేశ్‌ గత తెదేపా ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా.. కొత్త ఐటీ విధానాన్ని తీసుకొచ్చి, సమర్థంగా అమలు చేశారు. మంగళగిరి, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు. స్టార్టప్‌ కేంద్రాల్ని అభివృద్ధి చేశారు. విశాఖలో మిలీనియం టవర్స్‌ నిర్మించారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేసి, అనేక పరిశ్రమల్ని తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించారు. ఆయనకు ఉన్న అనుభవం, పట్టుదలతో వచ్చే ఐదేళ్లలో మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఆర్టీజీ రంగాల్లో తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నది తెదేపా ఎన్నికల హామీ. దాన్ని నెరవేర్చాలంటే ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని