Ramya: ప్రజలు అడ్డుకుని ఉంటే రమ్య బతికేదేమో: ఇన్‌ఛార్జ్‌ డీఐజీ

ఇంజినీరింగ్‌ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశామని గుంటూరు పోలీసులు తెలిపారు. సోమవారం

Published : 17 Aug 2021 01:43 IST

గుంటూరు: బీటెక్‌ విద్యార్థిని రమ్య(20)ను హత్య చేసిన నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశామని గుంటూరు పోలీసులు తెలిపారు. సోమవారం రమ్య హత్య కేసు వివరాలను ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు, ఎస్పీలు మీడియాకు వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు నెలలుగా రమ్య, శశికృష్ణకు పరిచయం ఉందని, తనని ప్రేమించాలని బస్టాండ్‌ వద్ద శశికృష్ణ రమ్యను వేధించేవాడని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ వివరించారు. రెండు నెలలుగా వేధింపులు పెరగడంతో శశికృష్ణతో రమ్య మాట్లాడటం మానేసిందని తెలిపారు. ప్రేమించకపోతే చంపుతానని నిందితుడు పలుమార్లు బెదిరించాడన్న డీఐజీ, నిన్న గొడవపడి రమ్యను శశికృష్ణ నరికి చంపాడన్నారు. రమ్య శరీరంపై 6 కత్తిపోట్లున్నాయని, జీజీహెచ్‌కు తీసుకెళ్లే క్రమంలో యువతి చనిపోయినట్లు తెలిపారు.

‘‘సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలకు యువత దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పరిచయమై వేధిస్తుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం మంచిది. రమ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో. ఇలాంటి వాటిని నిరోధించేందుకే ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక యాప్‌లు, నెంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి చోటా దిశ పెట్రోలింగ్‌ ఉంది. ప్రతి స్టేషన్‌లో మహిళా పోలీసులు ఉంటారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇందుకు కారణం పోలీసులు కాదు. మీరు ఫిర్యాదు చేసి, పోలీసులు స్పందించకపోతే దానికి బాధ్యత మాదే. కానీ, అది జరగలేదు’’

‘‘ఇబ్బంది కలిగిందనప్పుడు చాలా మంది పోలీస్‌స్టేషన్‌కు రావడానికి భయపడతారు. దాన్నో తప్పుగా భావిస్తారు. బాలికలు, మహిళలు తమకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. మహిళల భద్రత మా బాధ్యత. నిన్న జరిగిన ఘటనలో అక్కడే ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఉంటే బాగుండేది. ప్రాణాలు పోయి ఉండేవి కావు. ఈ ఘటన పోలీస్‌శాఖను కలచి వేసింది. ఇంకా ఏం చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకోగలమని డీజీపీతో సహా, అందరూ తర్జనభర్జన పడుతున్నారు. సోషల్‌మీడియా వల్ల జరిగే అనర్థాలను బాలికలు, మహిళలకు మరింత అర్థమయ్యేలా చెప్పాలని, ఇందుకు మరిన్ని క్యాంపెయిన్‌లు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. దీనికి తోడు ఉదయం చాలా మంది పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పోలీస్‌శాఖ ఏం తప్పు చేసింది? హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. శవరాజకీయాలు చేయటం మంచిది కాదు. ఈ కేసులో రాజకీయాలను తీసుకురావద్దు. మృతురాలి ఫోన్‌ మా వద్దే ఉంది. డిలీట్‌ అయిన వివరాలను కూడా వెనక్కి తీసుకొచ్చి విశ్లేషించి పూర్తి వివరాలు రాబడతాం’’ అని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని