Pinnelli: పల్నాడు జిల్లా జంట హత్యల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం
ఘాతుకానికి ప్రేరేపించిన వైకాపా నేతలు
కేసు నమోదు చేసిన పోలీసులు
ఏ6గా రామకృష్ణారెడ్డి, ఏ7 వెంకట్రామిరెడ్డి

ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి, మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు... ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో నిందితులు?
తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఈ నెల 24న ఓ శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తున్న తెదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను వెల్దుర్తి మండలం బోదిలవీడు సమీపంలో ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి.. రాళ్లతో మోది హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు భావిస్తుండగా, నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురిని నల్లమల అడవుల్లో గుర్తించగా.. మరొకరు గుంటూరులో తలదాచుకోగా పట్టుకున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు ఎవరనేది విచారణలో తేలనుంది. నిందితులు దొరికారా? లేదా? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
ముందస్తు వ్యూహంతో...
జంట హత్యలకు ప్రేరేపించడంతోపాటు హంతకులకు అన్ని విధాలా సహకారం అందించారని పిన్నెల్లి సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు తెదేపా నేతలు చెబుతున్న వివరాల ప్రకారం.. ముందస్తు వ్యూహంతో పిన్నెల్లి సోదరులు గుండ్లపాడులో వైకాపా నాయకులను తెదేపాలోకి పంపేందుకు ప్రయత్నించారు. దీనిని జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వ్యతిరేకించారు. దీంతో వారి చేరికకు అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు గ్రామంలో తెదేపా మరో నేత వెంకట్రామయ్య వెంట తిరుగుతూ అతనిని రెచ్చగొట్టారు. గ్రామంలో వెంకటేశ్వర్లు పెత్తనం పెరిగిందని, అతడిని తప్పిస్తే నీకు ఎదురుండదని వెంకట్రామయ్యకు నూరిపోశారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందుకు వెంకట్రామయ్యకు సహకరిస్తామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటకు చెందిన కొందరు భరోసా ఇచ్చారు. వెంకట్రామయ్యకు అండగా ఉంటామని పిన్నెల్లి సోదరులూ.. మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపారు. గతంలో వైకాపాలో కీలకంగా ఉండి ప్రస్తుతం తెదేపా నేతల వెంట తిరుగుతున్న జవిశెట్టి శ్రీను సహకారంతో ఈ హత్యలు చేశారు.
పోలీసు ఉన్నతాధికారిపై అసంతృప్తి
పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరుతో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని తెదేపా వర్గాల్లో చర్చ నడుస్తోంది. గుండ్లపాడులో పల్లెనిద్ర పూర్తయిన నాలుగు రోజుల్లోనే జంట హత్యలు జరిగాయని.. పోలీసు శాఖ నిఘా ఏమైందని వారు ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాలో వైకాపా అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడింది. అప్పట్లో కేసులు నమోదైనా బాధ్యులను అరెస్టు చేయలేదు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన ఘటనల్లోనూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి వైకాపా వారిని అరెస్టు చేస్తే ఉన్నతాధికారి ఆగ్రహించినట్లు సమాచారం. వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే ఆఘమేఘాలపై స్పందిస్తున్న అధికారి పాత కేసుల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్‌లో ఓ అధికారి అండ చూసుకుని జిల్లాలో ప్రజాప్రతినిధులు ఏం చెప్పినా పెడచెవిన పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు అత్యంత నమ్మకస్థుడైన ఎస్‌ఐ ఒకరిని ఎస్‌బీలో నియమించుకున్నారని, దీంతో జిల్లా పోలీసు శాఖలో చీమ చిటుక్కుమన్నా పిన్నెల్లికి తెలిసిపోతోందని సమాచారం. మాచర్లలో పని చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రంలో విధుల్లోకి తీసుకోవడంతో వీరిద్దరూ వైకాపాకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
హత్యలు చేసింది పిన్నెల్లి అనుచరులే
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులే హత్య చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఏడాదిగా పల్నాడులో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేలా పిన్నెల్లి వ్యవహరిస్తున్నారని, హత్యోదంతంలో పిన్నెల్లి సన్నిహితుడు జవిశెట్టి శ్రీను ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పిన్నెల్లి అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


