Crime news: ఆరో తరగతి విద్యార్థినిపై అకృత్యం

Eenadu icon
By Crime News Desk Published : 01 Nov 2025 04:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారం
ఐ.పోలవరం మండలంలో ఘటన
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

నిందితుడు రాయపురెడ్డి బాబీ

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: అభం శుభం తెలియని బాలికకు చాక్లెట్ల్లు ఇస్తూ..మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతమిది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె(11), కుమారుడు(9) ఉన్నారు. రెండేళ్లక్రితం భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని పుట్టింటి వద్ద ఉంటూ పిల్లలిద్దరినీ ఆమె పోషిస్తున్నారు. బాలిక ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన వరుసకు బంధువయ్యే రాయపురెడ్డి వెంకటసత్యకృష్ణ (బాబీ)(52) ఇటీవల బాలిక ఇంటి ముందుకు వచ్చి చాక్లెట్లు ఇచ్చి వెళ్లడాన్ని గమనించిన తల్లి కుమార్తెను ప్రశ్నించింది. తనకు, స్నేహితురాలికి బాబీ అప్పుడప్పుడు చాక్లెట్లు ఇస్తుంటాడని.. పలుమార్లు అతని ఇంటికి, అతని సోదరుడి ఇంటికీ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని.. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడని వివరించింది. దీంతో తల్లి గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం టి.కొత్తపల్లి సీహెచ్‌సీకి తరలించారు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రకుమార్‌ తెలిపారు. శుక్రవారం అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్‌ బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బాబీ మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని..అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు ఐ.పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యాకమిటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడు. విద్యార్థులకు క్రీడలపై అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్లి తర్ఫీదు ఇస్తుంటాడు. గతంలోనూ ఇతను పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.  

మహిళా కమిషన్‌ సీరియస్‌

ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డా.రాయపాటి శైలజ స్పందించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. బాధితురాలికి తక్షణ రక్షణ, వైద్య సహాయం, చట్టపరమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు