Murder: తల నరికి.. చేతుల వేళ్లు తొలగించి..

Eenadu icon
By Crime News Desk Published : 02 Nov 2025 05:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మహిళ దారుణ హత్య!

నవీపేట, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్‌ శివారులో  దారుణం వెలుగు చూసింది. కిరాతకంగా హత్యకు గురైన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి తల లేదు.. కుడి చేతిని మణికట్టు వరకు, ఎడమ చేతి వేళ్లను సగం వరకు నరికి వేశారు. దీనికి సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివీ... మిట్టాపూర్‌కు చెందిన రైతు సతీష్‌ శనివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లారు. పొలం సమీపంలో శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని.. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై తిరుపతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అత్యాచారానికి గురైన ఆమెను దారుణంగా హత్య చేసి, శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనంలో ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. నరికిన అవయవాల జాడ కోసం మృతదేహం కనిపించిన ప్రాంతాన్ని డ్రోన్‌ కెమెరాతో జల్లెడ పట్టారు. పోలీసు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. క్లూస్‌ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. పోలీసులు పది బృందాలతో గాలింపు చేపట్టారు.

డీఎన్‌ఏ పరీక్షలకు చిక్కకుండా..!

నేరస్థులు తమ ఆచూకీ లభ్యం కాకుండా ఉండేందుకే ఆమె చేతి వేళ్లు నరికేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాడినప్పుడు ఆమె చేతి వేళ్ల గోళ్లలో వారికి సంబంధించిన ఆధారాలు చిక్కే అవకాశం ఉంటుందని.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే బండారం బయటపడుతుందని అనుమానించి దుండగులు నరికేసి ఉంటారని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు