logo

ఒక్కో సీటుకు రూ. లక్షపైనే వసూలు!

అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి.

Published : 25 Jan 2023 06:20 IST

బీఎడ్‌ కళాశాల యాజమాన్యాల తీరిది
న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి. పొరుగు జిల్లాల్లో రూ.వేలు వెచ్చిస్తేనే సీటు లభిస్తుంటే ఇక్కడ మాత్రం అభ్యర్థుల జేబులను గుల్లచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు చెల్లించి ప్రవేశం పొందాక అసలు విషయం తెలిసి అవాక్కవడం అభ్యర్థుల వంతవుతోంది.

మంచిర్యాల జిల్లాలో బీఎడ్‌ కళాశాలలు లేవు. ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు ఉండగా ఇందులో ఒకటి ఉట్నూరులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ గిరిజన బీఎడ్‌ కళాశాల.. నిర్మల్‌ జిల్లాలో ఒకటి, కుమురం భీం జిల్లాలో రెండు కలుపుకొని మొత్తం ఆరు బీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఉట్నూరులోని గిరిజన బీఎడ్‌ కళాశాల మినహాయిస్తే మిగిలిన అయిదు కళాశాలలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఇందులో 75 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా.. మిగిలిన 25 శాతం మేర సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ విషయంలో అంతగా ఇబ్బందులు లేకపోయినా యాజమాన్య కోటా సీట్ల విషయంలోనే అసలైన చిక్కు నెలకొంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లువలా వెలువడటం.. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేయాలన్నా.. బీఎడ్‌ అర్హత తప్పనిసరి. దీనికితోడు బీఎడ్‌ అర్హత కలిగి ఉంటే సెకండరీ స్కూల్‌ టీచరు(ఎస్‌జీటీ)తో పాటు స్కూల్‌ అసిస్టెంటు(ఎస్‌ఏ) పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉండటంతో అంతా డీఎడ్‌కి బదులు బీఎడ్‌ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, సీట్లు పరిమితంగా ఉండటంతో యాజమాన్యాలు తమను సంప్రదిస్తున్న వారికి ఒక్కో సీటుకు రూ.లక్షపైనే చెబుతూ సీట్లు లేవని, మీరు కాదంటే మరొకరు సిద్ధంగా ఉన్నారంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తరగతులకు హాజరుకావద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్తే సెమిస్టర్‌ లెక్కన అధిక డబ్బులు వసూలు చేస్తారని, తమ కళాశాలలో చేరాలంటూ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. మెరుగైన బోధనలో పోటీపడాల్సిన యాజమాన్యాలు జట్టు కట్టి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా విద్యావ్యాపారం కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే సీటు ఉంది మరి!

జిల్లాలో ఏ బీఎడ్‌ కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించినా వారి నోట ఒకే సీటు ఉందనే మాట వినిపిస్తోంది. ఆలస్యం చేస్తే అదికూడా పోతుందని నమ్మబలుకుతున్నారు. చేసేదేమి లేక వారడిగినట్లు సబ్జెక్టు ఏదైనా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు ఇచ్చుకుంటున్నారు. మరీ బతిమాలితే నాలుగైదు విడతల్లో డబ్బులు కట్టొచ్చని ఒప్పుకొంటున్నారు.

అక్కడ రూ.25 వేలే..!

నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో యాజమాన్య సీటును కేవలం రూ.25 వేలకే ఇస్తున్నారు. తరగతులకు హాజరుకాకున్నా ఫర్వాలేదని, అంతా తామే చూసుకుంటామని చెబుతుండటం విశేషం. అక్కడి యాజమాన్యాల ప్రతిపాదన తమకు అనుకూలంగా ఉండటంతో పొరుగు జిల్లాలకు వెళ్లి అక్కడి కళాశాలల్లో చేరుతున్నారు. ఆ నోట.. ఈ నోట విషయం జిల్లాలో ఆయా కళాశాలల్లో చేరిన అభ్యర్థుల చెవిన పడటంతో ఇక్కడి యాజమాన్యాల తీరుతో మోసపోయామని లబోదిబోమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని