logo

ఆ ఊళ్లో అయిదు రోజులు పొయ్యి వెలిగించరు

అక్కడ అయిదు రోజులు ఇంట్లో పొయ్యి వెలిగించరు. టీవీ, సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగాక పల్లె జనం ఒక చోట చేరి పండగ చేసుకునే రోజులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇందుకు భిన్నంగా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా అయిదు రోజుల పాటు ఊరంతా ఒక చోట చేరి పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు.

Updated : 12 Apr 2024 07:09 IST

కాప్సిలో పంచమి వేడుకలు ప్రారంభం 

న్యూస్‌టుడే, బేల : అక్కడ అయిదు రోజులు ఇంట్లో పొయ్యి వెలిగించరు. టీవీ, సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగాక పల్లె జనం ఒక చోట చేరి పండగ చేసుకునే రోజులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇందుకు భిన్నంగా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా అయిదు రోజుల పాటు ఊరంతా ఒక చోట చేరి పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏ ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఒకే చోట సహపంక్తి భోజనాలు చేస్తూ దైవరాధనలో నిమగ్నమయ్యారు ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం కాప్సి(బి) గ్రామస్థులు.

మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా నేరి గ్రామవాసి నానాజీ మహరాజ్‌ విఠల్‌ రుకుంబాయి వీరభక్తుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందగా పాలేరుగా పని చేస్తూ జీవనం సాగించే వారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక చింతనతో గడిపేవారు. ఇలా పలు ప్రాంతాలు తిరుగుతూ వార్దా జిల్లా పెద్ద కాప్సి గ్రామానికి చేరుకుని గురువు విఠల్‌ రుకుంబాయి ఆలయాన్ని నిర్మించారు. ఆయన బోధనలు నచ్చిన వారు శిష్యులుగా చేరడంతో పాటు మద్యం, మాంసం, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండిపోయారు. ఉమ్రేడ్‌ గ్రామానికి చెందిన మాయిబాయితో స్థానికులు వివాహం   జరిపించారు.  

మారిన తీరు

గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ పాటిల్‌ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఎక్కడికి వెళ్లిన వ్యాధి నయం కాలేదు. ఎవరో మహరాజ్‌ గురించి చెప్పడంతో మహారాష్ట్రలోని పెద్ద కాప్సికి వెళ్లారు. అయిదు రోజుల్లో మామూలు వ్యక్తిగా మారాడు. కొన్నాళ్ల తర్వాత మహరాజ్‌ను కాప్సి గ్రామానికి ఆహ్వానించగా ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ఆ గ్రామం తీరే మారింది. మహరాజ్‌ నివసించే గ్రామం పేరు పెద్ద కాప్సి కావడంతో గ్రామానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకంగా మహరాజ్‌ దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.

సామూహిక భోజనాలు

కాప్సి గ్రామంలో 174 ఏళ్ల కిందట మహరాజ్‌ ఉగాది రోజున అడుగు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. మహరాజ్‌ స్వహస్తాలతో ప్రారంభమైన గుడిపడవా వేడుకలు గ్రామస్థుల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతోంది. పదేళ్లుగా అన్నదానం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. మనసులో ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తారు. ఏటా పదుల సంఖ్యలో ముందుకువస్తారు. పంచమి సందర్భంగా గ్రామస్థులు తేదీలను కేటాయిస్తే భోజనం ఏర్పాటు చేస్తారు. అలా అయిదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం కుటుంబ సమేతంగా సామూహిక భోజనాలు చేయడంతో ఆ ఊళ్లో పొయ్యి వెలిగించరు. ఉదయం, సాయంత్రం మహరాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి ఇస్తారు. ఈ నెల 14న ఈ వేడుకలు ముగుస్తాయి. పల్లకీ ఊరేగింపులో వేలాది మంది పాల్గొంటారు.
స్ఫూర్తి బతికే ఉంటుంది  

 వైద్య విఠల్‌, శిష్యుడు, కాప్సి

మహరాజ్‌ లాంటి సంతులు చాలా అరుదు. ప్రజలకు సేవ చేయాలని చెప్పిన బోధనలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. అందరం కలిసి సమష్టి నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. మహరాజ్‌ స్ఫూర్తి ఎప్పుడూ బతికే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని