logo

సరిహద్దులులేని ‘ప్రేమ’!

ప్రేమకు ఎలాంటి సరిహద్దులుండవని నిరూపిస్తున్నారు నేటి యువత.. ఖండాలు దాటి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. 

Updated : 12 Apr 2024 09:10 IST

 భారత్‌ అబ్బాయిలు.. విదేశీ అమ్మాయిలు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ సాంస్కృతికం :  ప్రేమకు ఎలాంటి సరిహద్దులుండవని నిరూపిస్తున్నారు నేటి యువత.. ఖండాలు దాటి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.  తమ సహ ఉద్యోగుల ప్రేమలో పడుతున్నారు. ఇంటి పెద్దలను ఒప్పించి, మెప్పిస్తున్నారు. మనసిచ్చిన పడతిని మనువాడుతున్నారు. అంతే కాదండోయ్‌ విదేశీయులైనప్పటికీ భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో వేద పండితుల వేదమంత్రాల నడుమ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రీ-వెడ్డింగ్‌, వెడ్డింగ్‌ ఫిల్మ్‌ వంటి వాటికి సైతం సై అంటున్నారు. ఇలాంటి వివాహాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే కొన్ని వెలుగు చూశాయి. తాజాగా తెలంగాణ యువకుడు, లండన్‌ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఈ కొత్త పోకడలను ఇరు కుటుంబాలు  ప్రోత్సహిస్తున్న  నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

విస్తరిస్తున్న ట్రెండ్‌..

వేర్వేరు దేశాలకు చెందిన యువతీ, యువకులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు.  విదేశీ అమ్మాయిలు ఏకంగా భారత యువకుల మనసులను ఇట్టే దోచేస్తున్నారు. వారి హృదయాలను గెలుస్తున్నారు. ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, కళా, క్రీడా రంగాలలో ఎక్కువగా మనకు ఇలాంటి ట్రెండ్‌ కనిపిస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. చాలావరకు ప్రేమ వివాహాలు వేర్వేరు మతాల వారితోనే జరుగుతున్నాయి.

ఒకరినొకరు అర్థం చేసుకొని.. 

ప్రేమకు హద్దులుండవు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారీ యువజంట. యువకుడు ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్‌ కాగా.. యువతి మయన్మార్‌ దేశానికి చెందిన జిన్‌ నెహూ థియేన్‌(క్యాథరిన్‌).. ఇద్దరూ ఖతర్‌ దేశంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని పెద్దలకు వివరించారు. వారి అంగీకారంతోనే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చింతగూడలోని సెయింట్‌ థామస్‌ చర్చిలో ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని, ప్రతి మాటకు విలువ ఇవ్వడంతోనే నేడు ఒక్కటయ్యామంటున్నారీ జంట.'

మూడు ముళ్ల బంధంతో ఒక్కటై..

మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని తెలంగాణ సంప్రదాయ రీతిలో వివాహమాడారు. బెల్లంపల్లిలో ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజు మూడేళ్లుగా లండన్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. భారతీయ సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరగాలని డయానా కోరారు. ఆమె కోరిక మేరకు పెద్దలు వివాహం జరిపించారు. తాము వేర్వేరు దేశాలైనప్పటికీ  ఒకరినొకరం గౌరవించుకున్నామని, అదే పెళ్లి అయ్యేలా   చేసిందంటున్నారు.

సాఫ్టుగా ఒక్కటయ్యారు..

ఆదిలాబాద్‌కు చెందిన అభినయ్‌రెడ్డి 2015 నుంచి అమెరికాలోని చికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. అదే దేశానికి చెందిన టేలర్‌ డయానె మర్సోలేక్‌ మిల్వాకి సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించారు, మెప్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహం చేసుకుని ఏకమయ్యారు. ప్రేమకు భాష, దేశం అడ్డురాదని, తమ మనసుల కలయికతోనే వివాహం చేసుకున్నామంటున్నారీ దంపతులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని