logo

విద్యుత్తు వినియోగదారుల పాట్లు

జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరగటం అప్రకటిత కోతలకు దారితీస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరిట తరచూ సరఫరా నిలిపివేస్తున్నారు. నిబంధనలకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

Published : 14 Apr 2024 02:57 IST

మరమ్మతుల పేరిట తరచూ సరఫరా నిలిపివేత

ఈటీవీ - ఆదిలాబాద్‌ : జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరగటం అప్రకటిత కోతలకు దారితీస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరిట తరచూ సరఫరా నిలిపివేస్తున్నారు. నిబంధనలకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారికంగా ఎలాంటి కోతలులేవని అధికారులు పైకి చెబుతున్నా అనధికారికంగా అప్రకటిత కోతలు విధిస్తుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఏడీఈలు, ఏఈల పాత్ర అత్యంత కీలకమైనది. కానీ కొంతమంది లైన్‌మెన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు, గ్రామస్థాయిలో పని చేసే తాత్కాలిక ఉద్యోగులపై వదిలేయటంతో సరఫరాలో అంతరాయానికి దారితీస్తోంది.


తప్పిన ప్రమాదం

నిర్వహణ అంటూ ప్రకటించే అధికారులు అసలు లైన్లను పట్టించుకోవటం లేదు. దానికి  ఉదాహరణే ఆదిలాబాద్‌ సీసీఐ సబ్‌స్టేషన్‌ నుంచి భీంపూర్‌ మండలం అర్లి(టి) సబ్‌స్టేషన్‌కు వెళ్లే 33 కేవీ లైన్‌. దాదాపు 40 కిలోమీటర్ల మేర వెళ్లే ఈ లైన్‌లోని స్తంభాలన్నీ భారీగా గాలివస్తే నేలవాలడం ఖాయంగానే మారింది. నాలుగు రోజుల కిందట జందాపూర్‌లోని చిల్కూరి దేవన్న పొలంలో విద్యుత్తు స్తంభం రాత్రి నేలవాలడంతో ప్రమాదం తప్పింది. 33 కేవీ లైనంటే 33వేలవాట్ల విద్యుత్తు సరఫరా అన్నమాట. గాలికి స్తంభం వంగి తీగలు నేలకు తగిలితే సరఫరా నిలిచిపోతోంది. ఒకవేళ తీగలు నేలకు తగలనట్లయితే సరఫరా ఉంటుంది. అలాంటప్పుడు రాత్రుల్లో తెలియకుండా అటవైపు వెళ్తే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.


ఇదిగో సాక్ష్యం..

ఆదిలాబాద్‌లోని కలెక్టర్‌, ఎస్పీ బంగళాలకు సమీపంలో ఉండే కైలాస్‌నగర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. అధికారుల కార్యాలయాలకు అంతరాయం లేకుండా, సాధారణ వినియోగదారులకు సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ నెల 4న సాయంత్రం దాదాపుగా మూడు గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. తాజాగా ఈ సబ్‌స్టేషన్‌తోపాటు మావల సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి 10.30 వరకు సరఫరా ఉండదని ప్రకటించిన అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునరుద్ధరించలేదు. ఫలితంగా కైలాస్‌నగర్‌, ఖానాపూర్‌, మావల, రిమ్స్‌ ఆసుపత్రి ఏరియాల్లో సరఫరా స్తంభించింది. మరోపక్క జైనథ్‌ మండలం భోరజ్‌, గిమ్మ, ఆదిలాబాద్‌ మండలం బంగారిగూడ, పిప్పల్‌దరి, అంకోలి, ఆదిలాబాద్‌లోని సీసీఐ, భుక్తాపూర్‌ సభ్‌ స్టేషన్‌ పరిధిలో సరఫరా నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని