logo

పురపాలికలకు అమృత భాగ్యం

సమస్యలతో సహవాసం చేస్తున్న పురపాలికల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. తీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Published : 14 Apr 2024 03:00 IST

తాగునీరు, మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం!

ఏపీనగర్‌లో కాలువ లేక రహదారిపై ప్రవహిస్తున్న మురుగు

భైంసా, న్యూస్‌టుడే: సమస్యలతో సహవాసం చేస్తున్న పురపాలికల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. తీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. చాలా వరకు శివారుకాలనీల్లో మురుగు నీటి వ్యవస్థ, పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యంలేక ప్రజలు అవస్థల పాలవుతున్నారు. పేదలు నివసించే మురికి వాడల్లోనైతే పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ప్రభుత్వం పురపాలికల అభివృద్ధికి అందించాల్సిన నిధులను విడుదల చేయక స్థానికులు మౌలిక వసతులకు నోచుకోలేక పోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా నిధుల కొరతతో పనులు చేపట్టలేక పోతున్నట్లు వారు చెబుతున్నారు. గతంలో భైంసా పురపాలక సంఘానికి ప్రత్యేకాభివృద్ధి కింద రూ.25కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో శివారు కాలనీల్లో ప్రతిపాదించిన కాలువలు, సీసీ రహదారులు నిర్మించలేదు. పూర్తి స్థాయిలో తాగునీటిని అందించలేక పోతున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన అమృత్‌ కార్యక్రమంలో గత సంవత్సరం నుంచి పురపాలికల్లో తాగునీటి, మురుగు వ్యవస్థను మెరుగు పరిచేందుకు పురపాలికలకు జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తోంది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి అమృత్‌ పథకంలో భైంసా, కాగజ్‌నగర్‌  మున్సిపాలిటీలకు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.62.83 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెప్పారు. దీంతో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భైంసా, కాగజ్‌నగర్‌ పురపాలికల్లోని శివారు కాలనీల్లో గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తాగునీటి వసతి కల్పించేందుకు ట్యాంకులు, పైప్‌లైన్‌ పనులు చేపట్టనున్నారు. మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు భూగర్భ కాలువలు, ఉపరితల కాల్వలు, అవసరమైన చోట సీసీ రహదారులు నిర్మించనున్నారు.


మార్గదర్శకాలు రాలేదు
వెంకటేశ్వర్లు, కమిషనర్‌, భైంసా

అమృత్‌ పథకంలో గతేడాది అన్ని పురపాలికలకు నిధులు వచ్చాయి. ఆ పథకంలో ప్రతిపాదించిన పనులకు ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. ఇంకా మార్గదర్శకాలు రాలేదు. పనులన్నీ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు