logo

భారాసకు మరో షాక్‌..!

విపక్ష భారత రాష్ట్ర సమితి (భారాస)కి మరో షాక్‌ తగిలింది. నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 14 Apr 2024 06:27 IST

నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ సహా పలువురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: విపక్ష భారత రాష్ట్ర సమితి (భారాస)కి మరో షాక్‌ తగిలింది. నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజులుగా తర్జనభర్జనల నడుమ ఊగిసలాడుతున్న కౌన్సిల్‌ సభ్యులు ఎట్టకేలకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయంలో స్పష్టత లేకపోయినా.. ఒకప్పటి అధికార భారాసను మాత్రం వీడుతున్నట్లు స్పష్టంచేశారు.

ఊగిసలాట నడుమ..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. ఇదివరకు భారాసలో కొనసాగిన చాలామంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నిర్మల్‌ మండలాధ్యక్షుడు సహా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, భారాస నేతలు అధికార కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, మరో 13 మంది కౌన్సిలర్లు భారాస సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఇంకొందరు భాజపా వైపు చూస్తున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంలో పూర్తి స్పష్టత లభించనుంది.


సందిగ్ధం.. అల్లోల ఆగమనం

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్ర, కేంద్ర నేతల ఆధ్వర్యంలో మంతనాలు కూడా సాగించారని చెబుతున్నారు. ఈనెల 6న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. వాస్తవానికి.. ఆయన అనుచరులు, పార్టీ నేతలు పార్టీని వీడకముందే అందరం కలిసి పార్టీ మారుదామని, తొందరపడొద్దని అల్లోల వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. కానీ, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమైతే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడొచ్చనే భావనతో పలువురు ఆయన సూచనను పట్టించుకోకుండా హుటాహుటిన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇంకొందరు అనుచరులు మాత్రం ఆయన వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క.. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్‌ నాయకులు వరుస ఆందోళనలు చేపట్టారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఇప్పుడిదంతా సద్దుమణిగినా.. అల్లోల చేరిక విషయంలో నెలకొన్న సందిగ్ధత మాత్రం తొలగలేదు. ఆయన పార్టీలో చేరుతారా లేదా, చేరితే ఎప్పుడు జరగొచ్చనే సందేహాలు స్థానికులను తొలచివేస్తున్నాయి.


భిన్న వాతావరణం..

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల విషయం పక్కనపెడితే నిర్మల్‌ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ కాకుండా ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో రెండు స్థానాలు భాజపా గెలుపొందడం గమనార్హం. ఇలాంటి తరుణంలో.. భారాసకు చెందిన వారు పార్టీని వీడే సమయంలో తర్జనభర్జన పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచన చేరడమా, లేక అధికార కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడమా అనే మీమాంసలో పడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరితే అధికార ఎమ్మెల్యే అండ లభించదు, అలాగని ఎమ్మెల్యే వద్దకు వెళ్తే.. అధికార పార్టీ పట్టించుకోదన్న భావన వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు రాజకీయ అవసరాలు, తమ అనుచరుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని