logo

నూకల బియ్యం.. తినేదెలా?

పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ప్రతి నెలా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోంది. నాణ్యతతో పంపిణీ చేయాల్సిన బియ్యంలో రాళ్లు, రప్పలు, దుమ్ముధూళి, నూకలు.. ఇలా వస్తుండటంతో ప్రజలు వండుకుని తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 14 Apr 2024 03:46 IST

సరఫరా అయిన నూకల బియ్యం

నిర్మల్‌ మండలంలోని ఓ గ్రామంలో చౌకధరల దుకాణానికి సరఫరా అయిన బియ్యం ఇవి. ఇక్కడికి వచ్చిన పలు సంచుల్లోనూ బియ్యం ఇలాగే ఉన్నాయి. నూకలతో కూడినవి రావడంతో వాటిని చూసి లబ్ధిదారులు ఇవేం బియ్యం.. ఎలా తినాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలోనూ పలు చోట్ల ఇలాంటివే వచ్చాయి. మరికొన్ని చోట్ల నాణ్యత లేకుండా దుమ్ముధూళితో ఉన్న బియ్యం వస్తున్నాయి.


నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ప్రతి నెలా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోంది. నాణ్యతతో పంపిణీ చేయాల్సిన బియ్యంలో రాళ్లు, రప్పలు, దుమ్ముధూళి, నూకలు.. ఇలా వస్తుండటంతో ప్రజలు వండుకుని తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి నెలా బియ్యం పంపిణీపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో గోదాముల నుంచి నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రేషన్‌ దుకాణాల నుంచి బియ్యం తీసుకెళ్లడానికి వచ్చిన లబ్ధిదారులు సంచుల్లో ఉన్న బియ్యం చూసి అసలు ఇవి తినేలా ఉన్నాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము ఏం చేయలేమని, గోదాము నుంచి వచ్చిన బియ్యం మీకు పంపిణీ చేస్తున్నామని, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని డీలర్లు సమాధానమిస్తున్నారు. చేసేదేమీ లేక లబ్ధిదారులు నిట్టూర్చూతూనే ఈ బియ్యం తీసుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పంపిణీ దాదాపు చివరి దశకు చేరుకుంది. గత్యంతరం లేక ప్రజలు వాటినే తీసుకెళ్తున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో 412 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం ఆయా చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రతి నెలా 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు ఇస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. సరఫరా అయ్యే బియ్యం విషయంలో సంబంధితశాఖ అధికారుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన లోపించింది.  ఫలితంగా బియ్యం సరిగా లేకపోవడంతో లబ్ధిదారులు తినడానికి ఇష్టపడడం లేదు. గత నెలలోనూ నిర్మల్‌ పట్టణం, భైంసా, లక్ష్మణచాంద మండలం తదితర చోట్లలోనూ నూకలుగా ఉన్నవి రావడంతో లబ్ధిదారులు వాటిని చూసి నివ్వెరపోయారు. వీటిని వండేదెలా.. తినేదెలా..! అని ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలున్నాయి.

పక్కదారి..

సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా ఇప్పటికే పలు చోట్ల పట్టుబడ్డ వాటి ఘటనలతో వెల్లడైంది. లబ్ధిదారుల నుంచి, ఇతరత్రా మార్గాల్లో పెద్ద మొత్తంలో బియ్యం తక్కువ ధరకు కొందరు కొంటున్నారు. వాటిని పక్కనున్న మహారాష్ట్రకు తరలించేవారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా వాటిని కొందరు లబ్ధిదారులు వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటినే తిరిగి మరోసారి పట్టించి గోదాములకు తరలిస్తున్నారన్న అనుమానాలు లేవనెత్తుతున్నారు. మరోదిక్కు మిల్లర్లు సీఎంఆర్‌ కోటాను ఎలాగైనా భర్తీ చేయాలనే ఉద్దేశంతో గత వర్షాకాలంలో వచ్చిన ధాన్యం నుంచి తడిసిన నిల్వలనూ మిల్లింగ్‌ చేసి పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా నూకలతో, ఏ మాత్రం నాణ్యత లేని బియ్యం రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. చౌకధరల దుకాణాలకు పంపించిన వాటిలో 25 శాతం వరకు నూకలతో, తినడానికి వీలులేని విధంగా ఉన్నవి వచ్చాయి. ఇలాంటి వాటిని ఎలా తినగలమని లబ్ధిదారులు నిలదీస్తుండడంతో డీలర్లు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయంపై సంబంధిత పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ను చరవాణిలో ‘న్యూస్‌టుడే’ సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని