logo

రెండు చోట్ల ఓట్ల లెక్కింపు

పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల ఓట్లను రెండు చోట్ల లెక్కించనున్నారు. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలోని సెంటినరీ కాలనీలో గల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్లు లెక్కించి అక్కడే ఫలితాలు వెల్లడించారు.

Published : 14 Apr 2024 03:16 IST

పార్లమెంట్‌ ఓట్లు లెక్కించనున్న ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్‌ కళాశాల ముఖద్వారం 

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల ఓట్లను రెండు చోట్ల లెక్కించనున్నారు. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలోని సెంటినరీ కాలనీలో గల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్లు లెక్కించి అక్కడే ఫలితాలు వెల్లడించారు. తాజాగా నిర్వహించే పెద్దపల్లి ఎంపీ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను హాజీపూర్‌ మండలంలోని ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్కిస్తారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను గతంలోలా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్కించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

పార్లమెంట్‌ నియోజక వర్గం ఎన్నికల అధికారిగా పెద్దపల్లి పాలనాధికారి ముజమిల్‌ ఖాన్‌, మంచిర్యాల జిల్లాకు ఎన్నికల అధికారిగా ఇక్కడి పాలనాధికారి బదావత్‌ సంతోష్‌, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఏడుగురు అదనపు పాలనాధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఆర్డీఓ స్థాయి అధికారులను సహాయ ఎన్నికల అధికారులుగా నియమించారు. పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 15,92,996 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 7,87,140 మంది, మహిళలు 8,05,755 మంది, 101 ఇతర ఓటర్లు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో ఈవీఎంలను భద్రపర్చడానికి ఒక్కో స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి, రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ, 28న పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నామినేషన్లను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్కడి ఎన్నికల అధికారి స్వీకరిస్తారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేస్తారు. రెండు జిల్లాల్లో వేర్వేరుగా చేసే ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత నియోజక వర్గాల వారీగా నమోదు చేస్తారు. చివరకు ఓట్ల లెక్కింపు ఫలితాలను పెద్దపల్లి జిల్లాలోనే అక్కడి ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయన రాజపత్రం అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని