logo

ఒత్తిళ్లు మొదలాయె.. తనిఖీలు నిలిచె

ధనార్జనే ధ్యేయంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై టీఎస్‌ఎంసీ (తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌) కమిటీ సభ్యులు కొరఢా ఝుళిపిస్తున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో తనిఖీలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Published : 14 Apr 2024 03:30 IST

ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం

ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్న టీఎస్‌ఎంసీ బృందం

  • ఇటీవల తనిఖీ చేసిన ఓ ఆసుపత్రిలో చిన్నచిన్న కారణాలతో వచ్చిన ఔట్‌పేషెంట్లుగా వచ్చిన బాధితులను ఆందోళనకు గురిచేస్తూ చేర్చుకుంటున్నట్లు టీఎస్‌ఎంసీ గుర్తించినట్లు తెలిసింది. వారి చికిత్స వివరాలు చూస్తే ఆర్‌ఎంపీ, అంబులెన్స్‌ ద్వారా వచ్చినట్లే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. సంబంధిత యజమానులే టీఎస్‌ఎంసీ సభ్యులకు బెదిరింపులు వచ్చేలా చేసినట్లు తెలుస్తోంది.

  • జిల్లా కేంద్రంలోని మరో ఆసుపత్రిలో ఒక్క వైద్యుడు లేకుండా స్టాఫ్‌నర్సులతోనే చికిత్స అందిస్తున్నట్లు టీఎస్‌ఎంసీ సభ్యుల బృందం తనిఖీల్లో గుర్తించింది. కనీస సదుపాయాలు, అందుబాటులో వైద్యులు లేకుండా ఉండటం గమచింది. అందులో చికిత్స పొందుతున్న బాధితుడితో వారు మాట్లాడగా.. మంచి ఆసుపత్రి అని ఓ ఆర్‌ఎంపీ తీసుకొచ్చారని చెప్పినట్లు తెలిసింది.

  • ధ్రువీకరణపత్రంలో ఉన్న వైద్యుడు ఒకరు.. చికిత్స అందిస్తుంది మరొకరు ఉండటం మరో ఆసుపత్రి తనిఖీలో బయటపడ్డట్టు సమాచారం. అర్హత లేకుండా పీజీ స్థాయి నిపుణులు చేసే వైద్యాన్ని చేస్తున్నట్లు గుర్తించడంతోపాటు చీటీలపై బాధితులను మోసగించేలా వైద్యుల పేర్లను ముద్రించి ఉన్నట్లు వారి పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది.

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: ధనార్జనే ధ్యేయంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై టీఎస్‌ఎంసీ (తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌) కమిటీ సభ్యులు కొరఢా ఝుళిపిస్తున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో తనిఖీలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మంచిర్యాల పట్టణంలో తనిఖీలు నిర్వహించి మూడు ఆసుపత్రుల్లోని లోపాలు గుర్తించి రాష్ట్ర కమిటీకి నివేదించారు. నిబంధనలు పాటించని, వైద్యులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై వేగంగా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ప్రజలకు నాణ్యమైన, ఆర్థికభారం పడకుండా సేవలు అందించేలా చూడటమే తమ లక్ష్యమని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఎంసీకి ఫిర్యాదులు అందిన ఆసుపత్రులను ఆయా సభ్యులు వివిధ శాఖల సహకారంతో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై దాడులు చేసి చర్యలు చేపట్టారు. టీఎస్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలువురు ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ చోదకులపై కేసులు నమోదయ్యాయి. బాధితుల జేబులు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఆయా మూడు ఆసుపత్రులు నిర్వహణ సాగుతుందని తనిఖీల్లో గుర్తించారు. బృందంలోని సభ్యుడు ఒకరు 12 ఆసుపత్రులపై ఫిర్యాదులు అందాయని, అన్నింటిని తనిఖీ చేస్తామని చెప్పారు. టీఎస్‌ఎంసీ నూతన కమిటీ చేస్తున్న ఆకస్మిక తనిఖీలతో ప్రైవేటు వైద్య వ్యవస్థ, ఆర్‌ఎంపీ, అంబులెన్స్‌ల ఆగడాలు తగ్గుముఖం పడతాయనే ఆశలు మొదలయ్యాయి. కానీ మూడింటితోనే నిలిపివేయడంతో కొంత అనుమానం కలుగుతోంది. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని సమాచారం. టీఎస్‌ఎంసీ ఏ ఒత్తిళ్లకు తలొగ్గదని, చర్యల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయా సభ్యులు చెబుతున్నారు. బెదిరింపులు, రాజకీయ నాయకుల నుంచి పైరవీలు వస్తుంది నిజమేనని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని