logo

వైద్యులు పెరిగినా.. అందని వైద్యం!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని, సాధారణ కాన్పులు జరిపించేలా చూడాలని సమావేశాల్లో తరచూ జిల్లా అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Published : 14 Apr 2024 03:33 IST

ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం బిడ్డతో లక్ష్మిబాయి

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని, సాధారణ కాన్పులు జరిపించేలా చూడాలని సమావేశాల్లో తరచూ జిల్లా అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి జనరల్‌ ఆసుపత్రిగా మారింది. గతంతో పోలిస్తే వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది సంఖ్య భారీగా పెరిగింది. కానీ ఆ స్థాయిలో వైద్య సేవలు మెరుగుపడనట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న కేసును మంచిర్యాల, ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తూ వైద్యులు చేతులు దులుపుకొంటున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే వసతులు లేవని చెప్పి దాటవేస్తున్నారు. మండలంలోని మోవాడ్‌ పంచాయతీ పరిధిలో చింతగూడకు చెందిన గర్భిణి లక్ష్మీబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు.. రెండు రోజుల కిందట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఇంకా మూడు వారాలు ఉందని చెప్పి పంపించారు. దీంతో కుటుంబీకులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రసవ సమయం దాటిందని చెప్పారని, గంట తరువాత మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


ప్రాథమిక చికిత్సకే పరిమితం
- ఆత్రం లింగు, ఎంపీటీసీ సభ్యుడు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకే సేవలు పరిమితమవుతున్నాయి. కొంచెం పెద్ద సమస్య వస్తే మంచిర్యాల, ఇతర ప్రాంతాలకు రాస్తున్నారు. గర్భిణి లక్ష్మీబాయి విషయంలో ఇదే జరిగింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని