logo

భూసార రక్షణ.. జల సంరక్షణ!

అడవుల నరికివేతతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా వర్షపు నీరు ఆశించిన స్థాయిలో భూమిలో ఇంకడం లేదు.

Published : 14 Apr 2024 03:46 IST

‘నీటి కుంటల’ నిర్మాణాలతో రైతులకు బహుళ ప్రయోజనం

కాగజ్‌నగర్‌ మండలం చింతగూడలో ఫారం పాండ్‌ పనుల్లో కూలీలు

కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అడవుల నరికివేతతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా వర్షపు నీరు ఆశించిన స్థాయిలో భూమిలో ఇంకడం లేదు. నేల మీదపడ్డ ప్రతి వాన నీటి బొట్టు కూడా వృథా పోకుండా ఉండేందుకు పలు పద్ధతులు పాటిస్తున్నారు. భూగర్భ జలమట్టం పెరగడానికి వివిధ పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పిస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడానికి సాగు భూముల్లో రైతులకు నయా పైసా ఖర్చు లేకుండా ఫారం పాండ్‌ (నీటి కుంటలు) నిర్మాణాలు చేపడుతోంది.  

జిల్లాలో కొన్నిచోట్ల సాగు భూములు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. ఆర్థిక స్తోమత లేకపోవడం పలువురు రైతులు చదును చేయించుకోలేక పోతున్నారు. దీంతో వాన కాలంలో వచ్చే వరదతో సాగు భూములు కోతకు గురికావడంతో నేల సారం దెబ్బతింటోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పేద రైతుల పాలిట వరంగా మారింది. ఏటా వేసవిలో స్థానికంగా పనులు లేక రైతులతో పాటు కూలీలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పథకం రాకతో కూలీలకు స్థానికంగా చేతినిండా పని లభిస్తుండగా, భూముల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములకు ఈ పథకంలో అడ్డుకట్టలు వేసే పనులతో పాటు ఫారం పాండ్‌ పనులతో సత్ఫలితాలు వస్తున్నాయి.

బెజ్జూరు మండలంలోని రెబ్బెనలో నీటితో కళకళలాడుతున్న ఫారం పాండ్‌

కొనసాగుతున్న 210 నీటికుంటల పనులు..

సాగు భూముల్లో ఎగువ ప్రాంతం నుంచి దిగువకు వచ్చే వరదకు అడ్డంగా నీటికుంటలు నిర్మిస్తుండటంతో.. భూసారం కొట్టుకుపోకుండా దోహదపడటమే కాకుండా వర్షపు నీరు ఇందులో నిల్వ ఉంటుండటంతో భూగర్భ జలమట్టం పెరుగుతోంది. ఏటేటా భూసారం పెరుగుతున్నందున పంటల దిగుబడిలోనూ పురోగతి కనిపిస్తోంది. గతంలో పంటల చీడలు సోకకుండా పురుగులమందు చల్లడానికి వాగులు, ఒర్రెల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నీటికుంటలులో వర్షపు నీరు నిల్వ అవుతున్నందున రైతుల కష్టాలు తగ్గాయి. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 234 నీటికుంటలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 210 ప్రారంభించగా.. పనులు కొనసాగుతున్నాయి.


గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక
- సురేందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి  

పట్టాదారు పాసు పుస్తకం, జాబ్‌ కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో రైతులు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. నీటికుంటల మంజూరుకు గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా వీటి నిర్మాణాలను పూర్తి చేస్తాం. వీటి నిర్మాణాలతో అన్నదాతలకు బహుళ ప్రయోజనం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు