logo

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా!

జిల్లాలో వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చీటీలు కొనసాగిస్తున్న వారి ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. శనివారం ఉదయం ప్రత్యేక బృందాలుగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కలిసి సోదాలు చేపట్టారు.

Updated : 14 Apr 2024 06:32 IST

జిల్లా కేంద్రంలో తనిఖీలు పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ  ప్రభాకర్‌రావు, చిత్రంలో డీఎస్పీ సదయ్య, సీఐ సతీష్‌

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, వాంకిడి, రెబ్బెన, న్యూస్‌టుడే : జిల్లాలో వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చీటీలు కొనసాగిస్తున్న వారి ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. శనివారం ఉదయం ప్రత్యేక బృందాలుగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కలిసి సోదాలు చేపట్టారు. ఒక్కసారిగా ఆయా వీధుల్లో పోలీసు వాహనాల సైరన్‌ మోగి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టడంతో ఇరుగు పొరుగు వారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు చీటీలు నిర్వహించే రిజిస్టర్లు, వడ్డీకి ఇచ్చి రాయించుకున్న ప్రామిసరీ నోట్స్‌, బాండ్‌ పేపర్లు, చెక్కులు, తెలుపు కాగితాలు, ఖాళీ బాండ్లపై అప్పు తీసుకున్న వారు సంతకాలు పెట్టి ఉన్న పత్రాలు, నగదును స్వాధీనం చేసుకొని వెళ్లిపోయినట్లు తెలిసింది.

అధిక వసూళ్లే కారణమా..?.

జిల్లాలో కొందరు వ్యాపారులు అధిక వడ్డీ డబ్బులు తీసుకొని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. పోలీసు బృందాలు ఇలా ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిసింది. కొందరు వ్యాపారులు వడ్డీ రూ.రెండు నుంచి రూ.అయిదు వరకు వసూలు చేస్తున్నారని, కొందరు తెల్ల కాగితం, ఖాళీ బాండ్‌ పేపర్లపై అప్పు తీసుకునే వారితో సంతకాలు చేయించి దగ్గర పెట్టుకోవడం, అప్పు వివరాలు నమోదు చేయకపోవడం, ఖాళీ బ్యాంకు చెక్కులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో.. కొందరు సాధారణ కుటుంబాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా కొందరు రిజిస్ట్రేషన్‌ లేకుండా చీటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో పోలీసులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిసింది.

కాగజ్‌నగర్‌లోని ఓ లాడ్జి వద్ద వ్యాపారి పత్రాల పరిశీలన..

ఆసిఫాబాద్‌లో..

ఆసిఫాబాద్‌ మండలంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్‌ లేకుండా కొందరు ఫైనాన్స్‌ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించినట్లు సీఐ సతీష్‌ తెలిపారు. తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 61 ప్రామిసరీ నోట్లు, 32 వివిధ బ్లాంక్‌ చెక్కులు, 22 అప్పు ఒప్పంద బాండ్‌ పత్రాలు, ఒకరి నుంచి రూ.14,79,070 నగదు సీజ్‌ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులపైనే కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.


రూ.23 లక్షల జప్తు

జిల్లాలో వడ్డీ వ్యాపారులు, చీటీలు నడుపుతున్న వారి వివరాలను పోలీసులు ముందుగానే గోప్యంగా సేకరించారు. ఆ వివరాల ప్రకారం సుమారు 15 బృందాలు అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో క్షేత్ర స్థాయిలో వెళ్లి తనిఖీలు చేశారు. ఆసిఫాబాద్‌, వాంకిడి, కాగజ్‌నగర్‌, రెబ్బెన.. ఇలా పలు మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలతో పాటు రూ.23 లక్షల నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో జప్తు చేసినట్లు సమాచారం. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. తనిఖీలు చేయడంతో వడ్డీ వ్యాపారులు, చీటీల నిర్వాహకుల్లో గుబులు రేగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని