logo

తేలని ఎంపీ, మాజీ ఎంపీ వైఖరి

ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ భాజపా టికెట్‌పై ఆశలు పెంచుకున్నా అధిష్ఠానం అనూహ్యంగా భారాసకు చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్‌ను పార్టీలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి.

Published : 14 Apr 2024 03:42 IST

పార్టీ కార్యక్రమాలకు దూరంగా సోయం, రమేష్‌ రాఠోడ్‌

ఈటీవీ - ఆదిలాబాద్‌ : ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ భాజపా టికెట్‌పై ఆశలు పెంచుకున్నా అధిష్ఠానం అనూహ్యంగా భారాసకు చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్‌ను పార్టీలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. అప్పటి నుంచి వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది రాజకీయ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే మూడు పార్టీల తరఫున అభ్యర్థిత్వాలు ఖరారు కావటంతో మార్చే పరిస్థితి లేదు. ఒకవేళ సోయం బాపురావు, రమేష్‌ రాఠోడ్‌ పోటీ చేయాలంటే స్వతంత్ర అభ్యర్థులుగానో, లేదా ఏదైనా పార్టీ తరఫున పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఎన్నికల బరిలో నిలిస్తే ఏ పార్టీకి కలిసి వస్తుంది. ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనే చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్‌ ఇదే చివరిది. వచ్చే 2026లో ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం జనరల్‌గా మారే అవకాశం ఉంది. ఫలితంగా ప్రస్తుతం కాంగ్రెస్‌, భాజపా, భారాస తరఫున బరిలో ఉన్న ఆత్రం సుగుణ, గోడం నగేష్‌, ఆత్రం సక్కుకు ఈ ఎన్నిక అత్యంత కీలకం. ప్రధాన మంత్రి మోదీ చరిష్మా, హిందూత్వ నినాదంపై భాజపా ఆధారపడి పని చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభావం, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌లో ధీమా కనిపిస్తోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భాజపా, కాంగ్రెస్‌ కంటే అధికంగా ఓట్లు రావటం, ఆ రెండు పార్టీల నేతల్లో బయటపడుతున్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవాలని స్వయంగా కేసీఆర్‌, కేటీఆర్‌ పావులు కదుపుతున్నారు. గెలుపోటములపై మూడుపార్టీలు మూడు రకాలుగా వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నా సోయం బాపురావు, రమేష్‌ రాఠోడ్‌ వైఖరిపై ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమవుతోంది.

చర్చనీయాంశంగా గైర్హాజరు..

ఆదిలాబాద్‌లో శనివారం భాజపా నిర్వహించిన పార్లమెంటు క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. వారికి సమాచారం ఇవ్వలేదా? ఇచ్చినా రాలేదా? అనే విషయం పార్టీ వర్గాలు సైతం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా సోయం బాపురావు, రమేష్‌ రాఠోడ్‌ సమన్వయంతో ప్రచారం చేయాలని రాష్ట్ర, జాతీయ నాయకత్వం సూచనలను స్థానిక నేతలు పట్టించుకోవటం లేదనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. పలకరింపులే తప్పితే పట్టించుకోవటం లేదనే అసంతృప్తి సోయం, రమేష్‌ రాఠోడ్‌, బాపురావు అనుచరుల్లో నెలకొంది. ఫలితంగా వారి నిర్ణయం ఎటువైపు దారితీస్తుందనే దాని కోసం కాంగ్రెస్‌, భారాస అధిష్ఠానాలు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని