logo

మార్కెట్‌ మాయ

ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు. నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఒక వేళ విక్రయించకుండా.. ఇళ్లల్లో నిల్వ చేసుకొని వేచి చూస్తే ధరలు పెరుగుతాయనే భరోసా లేదు. చేతికివచ్చిన పంటను ధర లేనప్పుడు దాచుకొని, అవసరమైనప్పుడు

Published : 14 Apr 2024 03:58 IST

అన్నదాతనుంచి చేజారాక.. లాభాల ఒరవడి
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

కంది, సోయా

ప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు. నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఒక వేళ విక్రయించకుండా.. ఇళ్లల్లో నిల్వ చేసుకొని వేచి చూస్తే ధరలు పెరుగుతాయనే భరోసా లేదు. చేతికివచ్చిన పంటను ధర లేనప్పుడు దాచుకొని, అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలు లేక ఎక్కువమంది రైతులు పంటచేతికి రాగానే అమ్మేస్తుంటారు. మొన్నటివరకు మద్దతు ధర కూడా దక్కని పత్తి ధర తాజాగా క్వింటాలకు రూ.1000 పెరిగింది. ఏడు వేలు కూడా దాటని కందుల ధర తాజాగా రూ.11 వేలకు చేరుకుంది. రైతుల చేతిలో ఉన్న సమయంలో పెరగని పంటల ఉత్పత్తుల ధరలు పంటను విక్రయించాక నెలరోజుల వ్యవధిలో అనుహ్యంగా పెరిగిపోయాయి. జిల్లాలో నెల రోజుల కిందట రైతులు విక్రయించిన నాటి ధరలతో ప్రస్తుత ధరలను పోల్చితే ఎంత నష్టపోయారనేది తెలిసిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలను లెక్కిస్తే.. జిల్లా మొత్తంలో దాదాపు రైతులు రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.

పత్తి, శనగ

మార్కెట్‌ మాయాజాలంతో ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు నష్టపోతుంటే.. అవే పంటలు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. కొనుగోళ్ల సీజన్‌లో తక్కువగా ఉండే పంట ఉత్పత్తుల ధరలు క్రయవిక్రయాలు ముగిసే సమయంలో అమాంతంగా పెరిగిపోతున్నాయి. వాస్తవానికి రైతులు పంట ఇంటికి రాగానే అవసరాలకు ఆ సమయంలో ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్ముకుంటారు. ఏ కొద్ది మందో తప్ప చివరి వరకు ఇళ్లల్లో నిల్వ చేసుకొని.. ధర పెరుగుతుందని ఎదురుచూసే వారు తక్కువే. తీరా ధర పెరుగుతుందని ఇళ్లల్లో నిల్వ చేసుకుంటే.. మార్కెట్‌ పరిస్థితులపై అవగాహన లేని అన్నదాతలు నష్టపోతున్నారు.


జైనథ్‌ మండలం లేఖర్‌వాడకు చెందిన ఈ రైతు పేరు జక్కుల శ్రీనివాస్‌. తనకున్న నాలుగు ఎకరాల్లో సోయా, కంది అంతర పంటగా సాగు చేస్తే.. కాలం కలిసి రాక 13 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు అప్పట్లో రూ.7,200 ధర ఉంది. మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువే ఉండటంతో విక్రయించాడు. ఇప్పుడు అదే కంది పంట నెల రోజుల్లోనే క్వింటాలుకు రూ.11 వేలకు చేరుకుంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.3,800 చొప్పున 13 క్వింటాళ్లకు రూ.49,400 రైతు నష్టపోయాడు.  


తానూర్‌కు చెందిన ఈ రైతు పేరు గణేశ్‌. తనకున్న అయిదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ.7,020 ఉంది. ప్రైవేట్‌లో క్వింటాలుకు రూ.6,700లకు విక్రయించాల్సి వచ్చింది. కొంతమంది రైతులు ధర పడిపోతుండటంతో సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. 8 శాతం తేమ ఉన్న రైతులకు మద్దతు ధర ఇవ్వగా, చాలామందికి మద్దతు ధర కూడా దక్కలేదు. తాజాగా ప్రైవేటులోనే పత్తి ధర క్వింటాలుకు రూ.7,700లకు చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని