logo

గౌతమ్‌.. నన్ను మన్నించురా...

మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 18 Apr 2024 09:37 IST

గౌతమ్‌.. నన్ను మన్నించురా...
అనుకోలేదు.. నా ఆయువు అర్ధాంతరంగానే ముగుస్తుందని..
చిన్నతనంలోనే అమ్మప్రేమకు దూరం అయ్యావురా..
పాలవాసనలు ఇంకా ఆరనేలేదు..
ముక్కుపచ్చలారని పసివాడివిరా..
కాసేపు కన్పించకుంటేనే తల్లడిల్లే వాడివి..
నూరేళ్లు తల్లిప్రేమకు కరవైతివి.
ఆకలేస్తే అమ్మ.. అమ్మా అంటూ పిలిచేవాడివి..
ఇప్పుడు ఏట్లారా.. గౌతమ్‌..
తలచుకుంటునే నరకం కనిపిస్తుంది..
అమ్మ..అమ్మ అని పిలుస్తుంటేనే గుండెలు పగులుతున్నాయి..
అంబులెన్సు చుట్టూ తిరుగుతుంటే..
నా కన్నులు చెమ్మగిల్లాయి..
అమ్మ కోసం అక్కడి వారిని అడుగుతుంటే..
బతికితే బాగుండు అనిపించింది నాన్న..
ఏం చేద్దాం.. ఆ మృత్యువు కరెంటు రూపంలో నన్ను కబళించింది..
నీ లాలన ఎవరు చూస్తారో..
నీకు లాలా ఎవరు పోస్తారో..
కళ్లల్లో నీరూపం నింపుకొని లోకం వీడుతున్నా..
నాలుగేళ్ల వయసులోనే నిన్ను ఒంటరిని చేసినందుకు..
నన్ను క్షమించురా బిడ్డా..

కాసిపేట, బెల్లంపల్లి గ్రామీణం న్యూస్‌టుడే: మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామానికి చెందిన బెడ్డల మౌనిక(26)ను బుధవారం ఇంట్లో వస్త్రాలు శుభ్రం చేస్తున్నారు. ట్యాంకు నుంచి నీరు రాకపోవడంతో నిచ్చెన సహాయంతో రేకులపైకి వెళ్లారు. అయితే ఇంట్లోకి వచ్చే తీగ తెగి రేకులకు విద్యుత్తు సరఫరా అయ్యింది. మౌనిక విద్యుదాఘాతానికి గురై రేకులపై పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. పైకి వెళ్లిన తల్లి ఎంతకీ కిందకు రాకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌ ఎక్కి నాలుగేళ్ల కుమారుడు గౌతమ్‌ చూడగా రేకులపైన పడిపోయి కనిపించింది. వెంటనే పెద్దనాన్నకు సమాచారం ఇవ్వడంతో రేకులపైకి వెళ్లిన ఆయనకు సైతం విద్యుత్తు సరఫరా అయ్యింది. కింద ఉన్న వారు వెంటనే సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. అనంతరం మౌనికను కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు.

తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న కుమారుడు గౌతమ్‌

ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే..

మౌనిక తల్లి రెండేళ్ల కిందట మృతి చెందింది. ఇంట్లో పనులు చేసేందుకు మూడు రోజుల కిందట ముత్యంపల్లిలోని తల్లిగారి నివాసానికి మౌనిక వెళ్లింది. బుధవారం శ్రీరామ నవమి కావడంతో ఉదయాన్నే అత్తగారి ఇంట్లో మౌనికను తండ్రి దింపివేసి వెళ్లారు. కొద్దిగంటల్లోనే కుమార్తె మరణ వార్త రావడంతో తండ్రి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఆమెకు భర్త రాజేశ్‌, కుమారుడు గౌతమ్‌ ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని