logo

మార్కెట్‌ కేంద్రంగా మొబైల్‌ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!

జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం.

Updated : 19 May 2024 08:58 IST

రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్‌

జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. నిత్యం కాయగూరలు, పండ్లు, ఇతర వస్తువుల క్రయ విక్రయాలతో రద్దీగా ఉంటుంది. మామూలు రోజుల సంగతి పక్కనపెడితే వారాంతం వచ్చిందంటే అక్కడ మొబైల్‌ దొంగతనాలు సర్వసాధారణమైంది. ఇతర రోజుల్లోనూ ఈ చోరీలు జరుగుతున్నా, ఆ రోజున మాత్రం కాస్త ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా ఇక్కడకు వచ్చే ప్రజలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం

అనుమానించకనే..

మార్కెట్‌ వచ్చి వెళ్లాక తమ చరవాణులు కనిపించకపోవడంతో చాలామంది రద్దీలో ఎక్కడో పడిపోయి ఉంటుందనుకుంటున్నారు. కానీ.. అది అత్యంత అరుదైన విషయం. కాయగూరల కొనుగోలు క్రమంలో అదునుచూసి దొంగిలిస్తున్న విషయం గుర్తించడం లేదు. అటూఇటూ తచ్చాడుతున్న పిల్లల కదలికలపై అనుమానం రావడం లేదు. నేరుగా ఎవరైనా పట్టుబడితేనే దొంగల సంచారం ఉందని నిర్ధారణ జరుగుతోంది. వారాంతాలైన శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో జరిగే చోరీలు ఎక్కువేనన్నది బహిరంగ రహస్యం. పోలీసులకు ఈ విషయమై పలువురి నుంచి ఫిర్యాదులు అందుతుండటం దీనికి నిదర్శనం. కొనుగోళ్లకు వచ్చిన వారికి మేం తరచూ హెచ్చరిస్తున్నాం. జేబుల్లో చరవాణులు జాగ్రత్త, దొంగలున్నారని చెప్తున్నామని కూరగాయల విక్రేత ఒకరు పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది.

హడావుడిని ఆసరాగా చేసుకొని..

జిల్లాకేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో నిత్యం ఉదయంవేళల్లో రద్దీగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారు, వ్యాపారులు.. ఇతరత్రా పనులకు వెళ్లేవారంతా వీలైనంత త్వరగా కాయగూరలు కొనుగోలు చేయాలని వస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మలుచుకున్న కొందరు వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలుదారులు ఏమరుపాటుగా ఉన్న ఆ కొద్దిక్షణాల్లోనే వారివద్ద ఉన్న చరవాణిని మాయం చేస్తున్నారు. ప్రతీవారం సగటున అయిదారుగురు చరవాణి పోగొట్టుకున్న బాధితులు ఉండటం గమనార్హం.

భద్రత కరవు

రద్దీ ప్రదేశంలో కనీసం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. సరైన పర్యవేక్షణ లేదన్న కారణమూ దొంగతనాలకు ఆస్కారమిస్తోందని స్థానికులు వాపోతున్నారు. చోరీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే నిందితులను పట్టుకునేందుకు ఆస్కారము ఉంటుంది. పోలీసులు ఉన్నారన్న భయంతో నేరాలకు పాల్పడేవారూ కాస్త వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. కానీ.. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఒకవేళ చోరీ జరిగితే సమాచారం అందించి, వారొచ్చే వరకు చూడాల్సివస్తోంది. ఏదైనా జాప్యం జరిగితే నిందితులు తప్పించుకునే అవకాశం ఏర్పడుతోంది.  

చిన్నారులే పాత్రధారులు

  • పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూరగాయల కొనుగోలుకు వెళ్లారు. అరగంట సమయంలో కావాల్సినవి కొనుగోలుచేసి బయటకు వద్దామనుకునేలోపు రూ.25 వేల విలువైన తన కొత్త చరవాణి కనిపించకుండా పోయింది. దీంతో కాసేపు అక్కడ వెతికినా, నంబర్లకు కాల్‌చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కూరగాయలు కొనుగోలు చేస్తుండగా పక్కనే అమాయకంగా ఓ పిల్లాడు కనిపించాడని, అతడే ఇలా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశాడు.
  • కొద్దిరోజుల క్రితం జరిగిన మరో ఘటనలో.. ఓ వ్యక్తి విక్రేతతో మాట్లాడుతున్న సమయంలో బాలుడు అతడి జేబులోని మొబైల్‌ అపహరించే ప్రయత్నం చేశాడు. గుర్తించిన సదరు వ్యక్తి అతడిని పట్టుకొని నాలుగైదు దెబ్బలువేశాడు. పోలీసులకు అప్పగిస్తానని చెప్పడంతో పొరపాటు జరిగిందని, వదిలెయ్యమంటూ ఏడ్వడంతో చేసేది లేక అతడిని వదిలేశారు.

ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. వచ్చినవారంతా ఎక్కడ ఏ కూరగాయలున్నాయి, తాజాగా ఉన్నదెక్కడ, ఎవరెంత ధరలో విక్రయిస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేద్దాం.. ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. ఆ సమయంలో పక్కనే అమాయకంగా చిన్నపిల్లలు తిరుగుతున్నా అంతగా పట్టించుకోరు. అలాంటి పిల్లల్లోనే కొందరు మొబైల్‌ చోరీల్లో సిద్ధహస్తులంటే విస్తుపోతాం. ఇక్కడ జరుగుతున్న తతంగంలో వారే ప్రధాన సూత్రధారులు. ఈ పిల్లల లక్ష్యం చరవాణులే. ఏమరుపాటుగా ఉన్నవారిని గుర్తించి అనుసరిస్తారు. బృందంగా ఉండే ఈ పిల్లల్లో ఎవరైనా ఒక మొబైల్‌ను నేర్పుగా తస్కరించగానే, వెంటనే దాన్ని సమీపంలోని మరొకరికి అప్పగిస్తాడు. వారు దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా క్షణాల వ్యవధిలో పూర్తవుతుంది. ఎలా జరిగిందో తెలియక బాధితులు విస్తుపోతారు. ఒకవేళ పట్టుబడినా చిన్నపిల్లలని ఒకటి, రెండు దెబ్బలు వేసి వదిలేస్తారన్న భావన, పోలీసులకు చిక్కినా పెద్దగా కేసవ్వదనే నమ్మకం దొంగలకు మరింత బలాన్నిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు