logo

ప్రజా శ్రేయస్సుకు ప్రత్యేకముద్ర

ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా స్థాయి అధికారులు తమ సర్వీసులో చేపట్టిన వినూత్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Published : 28 May 2024 01:50 IST

క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తున్న అధికారుల నిర్ణయాలు

 లైవ్‌ లోకేషన్‌తో వాట్సాప్‌ గ్రూపులో ఉపాధ్యాయుల హాజరు నమోదు చిత్రం 

దిలావర్‌పూర్, న్యూస్‌టుడే: ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా స్థాయి అధికారులు తమ సర్వీసులో చేపట్టిన వినూత్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సమయం పాలన కోసం లైవ్‌ లోకేషన్, రక్తహీనత తొలగించేలా అనీమియా సే ముక్త్‌ నిర్మల్, సమీకృత వ్యవసాయం వంటి ప్రయోగాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. జిల్లా నుంచి అధికారులు బదిలీ అయినా వారు ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు ప్రజాచైతన్యాన్ని పెంచుతున్నాయి. బదిలీపై జిల్లాకు వచ్చిన నూతన అధికారులు వివిధ శాఖల అధికారుల సహకారంతో వాటినే కొనసాగిస్తున్నారు.

ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపు.. 

లైవ్‌ లోకేషన్‌  

ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సమయ పాలన పాటించరనే భావన ప్రజల్లో తొలగించాలని అప్పటి జిల్లా పాలనాధికారి ముషారఫ్‌అలీ నిర్ణయించారు. ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించేలా చూసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో లైవ్‌ లోకేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయానికి వివిధ ప్రభుత్వ పాఠశాలలు, వివిధ కార్యాలయాల ఉద్యోగులు నిర్ణీత సమయానికి వాట్సాఫ్‌ ద్వారా లైవ్‌ లోకేషన్‌ లింక్‌ షేర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ అన్ని కార్యాలయాలు, ఉపాధ్యాయులు పాటిస్తున్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచింది.

రక్తహీనత నివారణపై ప్రయోగం.. 

అనీమియా సే ముక్త్‌ నిర్మల్‌

నిర్మల్‌ జిల్లాలో గర్భిణులు ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని గుర్తించిన అప్పటి పాలనాధికారి వరుణ్‌రెడ్డి దీనికి కారణం రక్తహీనత అని  తెలుసుకున్నారు. దీని నివారణకు ‘అనీమియా సే ముక్త్‌ నిర్మల్‌’ (ఏఎన్‌ఎం) పేరిట ఓ కార్యక్రమం రూపొందించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఏఎన్‌ఎంను ప్రోత్సహించి పాఠశాల విద్యార్థులు, కిశోరబాలికల ఆరోగ్య పరిరక్షణకు సదస్సులు నిర్వహించారు. యువతి గర్భం ధరించగానే ప్రసవం పొందే వరకు రక్తహీనత లోపం తలెత్తకుండా పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించే కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికీ జిల్లావైద్యాధికారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక వాహనం కేటాయించి సేవలు అందిస్తున్నారు.

స్వయం ఉపాధిమార్గాలను పెంచేందుకు.. 

సమీకృత వ్యవసాయం

ఐకేపీ మహిళలు స్వయం ఉపాధి పొందేలా డీఆర్డీవో విజయలక్ష్మి తక్కువ స్థలంలోనే నిత్యాదాయం పొందే సమీకృత వ్యవసాయం, పెరటి తోటలు వంటి ప్రత్యేక కార్యక్రమాలతో మహిళలు కూరగాయలు, తోటకూరలతో నిత్యం ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. సంఘ సభ్యుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారికి ఉపాధిమార్గాలను అందిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని రైతు సంఘ సభ్యులతో వరికుచ్చులు తయారు చేయించి విక్రయిస్తున్నారు. జిల్లాలోని అనేక మంది వీటిని కొనుగోలు చేసి పక్షులకు ఆహారంగా ఇంటి ఆవరణలో ఉంచుతున్నారు. సమీకృత వ్యవసాయంలో పండించిన బీట్‌రూట్, క్యారెట్‌ వంటి పంట ఉత్పత్తులను విక్రయించేలా ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటుతో ప్రోత్సహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని