logo

దూరంగా జలాలు.. తాగునీటి తంటాలు

కడెం జలాశయం నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా అయిదు మండలాల్లోని సుమారు 300 గ్రామాలకు తాగు నీరందించాలనే లక్ష్యం ఉంది. కొన్ని గ్రామాలకు ఆయా కారణాలతో నీరందడం లేదు.

Published : 28 May 2024 01:51 IST

300 గ్రామాలకు కష్టాలు

కడెం జలాశయంలో మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌వెల్‌కు దూరంగా జలాలు 

కడెం, న్యూస్‌టుడే: కడెం జలాశయం నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా అయిదు మండలాల్లోని సుమారు 300 గ్రామాలకు తాగు నీరందించాలనే లక్ష్యం ఉంది. కొన్ని గ్రామాలకు ఆయా కారణాలతో నీరందడం లేదు. కానీ చాలా గ్రామాలకు నీటిసరఫరా చేస్తున్నారు. అయితే కడెం జలాశయంలో నీటిమట్టం కనిష్ఠ స్థాయి కన్నా దిగువకు తగ్గిపోవడంతో మిషన్‌ భగీరథ పథకానికి నీరందించేందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వేసవి కావడంతో నీటిసరఫరా లేకుంటే జనాలు అల్లాడే పరిస్థితి ఉంది. దీంతో జలాశయంలో దూరంగా ఉన్న నీటిని ఇన్‌టేక్‌ వెల్‌ వరకు తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. 

కనిష్ఠం కన్నా దిగువకు 

జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రధాన కాలువ బెడ్‌లెవల్‌ 675 అడుగులు. అంతకన్నా తక్కువకు నీటిమట్టం తగ్గిపోతే అటు సాగునీటికి, ఇటు తాగునీటికి అందకుండా పోతుంది. తాగునీరు అందకుండా పోయే పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఎదురవుతుంది. ప్రస్తుతం కనిష్ఠానికి తక్కువగా 672 అడుగులకు పడిపోవడంతో జలాశయం బురదమట్టి తేలి బోసిపోయి కనిపిస్తోంది. భగీరథ పథకం మొదలయ్యాక 2019లో ఇలాగే 672 అడుగులకు నీటిమట్టం పడిపోవడంతో అధికారులు అపుడు ఇన్‌టేక్‌వెల్‌ నుంచి నీటిమట్టం ఉన్నవరకు కాలువ తీసి రెండు రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేశారు. అపుడు తీసిన కాలువ కొంతమేర అలాగే ఉండడంతో అందులోంచి నీరొస్తుంది. రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుండడంతో మిషన్‌ భగీరథ అధికారులు కాలువలో పేరుకుపోయిన మట్టిని కూలీలతో తొలగింపజేసి బావి వరకు నీరొచ్చేలా చేస్తున్నారు. ఆదివారం పొడవాటి తొండం ఉన్న పొక్లెయిన్‌తో కాలువను మరింత లోతుగా తీయించారు. ఎంతదూరం వీలైతే అంతదూరం ఇలా కాలువను వెడల్పు చేసి భగీరథ పథకం బావి వరకు నీరొచ్చేలా చేసి నల్లా నీటికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు పెద్దగా వర్షాలు కురిసి వరద నీరు వస్తేకాని మిషన్‌ భగీరథ పథకానికి ఈ ఇబ్బంది తప్పేలా లేదు.

అయిదేళ్ల తర్వాత సమస్య పునరావృతం 

కడెం జలాశయంలో నీటిమట్టం అయిదేళ్ల క్రితం 2019లో ఇలాగే కనిష్ఠంకన్నా దిగువకు పడిపోయింది. అపుడు నీటిమట్టం మే 31 వరకు 672 అడుగులుగా ఉంది. ఆతర్వాత వచ్చిన వరదలతో మట్టం పెరిగింది. 1998, 2010, 2015, 2016ల్లోనూ ఇలాగే కడెంలో నీటిమట్టం 672అడుగులకు పడిపోయి జలాశయం బోసిపోయి కనిపించింది. అపుడు సైతం కడెం వాసులకు తాగునీటికి తిప్పలు తప్పలేదు. ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాలకు తాగునీటినందించే మిషన్‌ భగీరథ పథకం ఇక్కడ ఉండటంతో మరికొద్ది రోజులు వర్షాలు కురవకున్నా పథకానికి నీరందేలా అధికారులు ఇన్‌టేక్‌ వెల్‌కు నీరొచ్చేలా కూలీలు, పొక్లెయిన్‌ సాయంతో బురదలోనూ కాలువ తీస్తూ నీరందేలా చూస్తున్నారు. ఇపుడు తీసిన కాలువతో మరో 15 రోజుల వరకు భగీరథ పథకానికి నీరందే అవకాశం ఉందని, అప్పటికీ వర్షాలు వస్తే ఇబ్బంది తొలగుతుందని ఆశిస్తున్నామని భగీరథ డీఈఈ వెంకటరమణ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఇపుడైతే రోజూ నీటిసరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని