logo

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు

ఆదిలాబాద్‌ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అశిష్‌సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓట్ల లెక్కిపు (కౌంటింగ్‌) అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.

Published : 28 May 2024 01:53 IST

మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్, చిత్రంలో నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల అదనపు పాలనాధికారులు కిషోర్‌కుమార్, శ్యామలాదేవి

నిర్మల్, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అశిష్‌సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓట్ల లెక్కిపు (కౌంటింగ్‌) అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నిర్మల్‌ జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఆదిలాబాద్‌ ప్రభుత్వ పాల్‌టెక్నిక్‌ కళాశాలలో ఉంటుందని, కౌంటింగ్‌ అధికారులు ఆ రోజు ఉదయం 5.30 గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రారంభించాలని, అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ  ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభించాలని, ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలను తెలిపేందుకు స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్వోలకు సమాచారం అందించాలని, రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత ఫారాలు జాగ్రత్తగా నింపాలని సూచించారు. మాస్టర్‌ ట్రైనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఓట్ల లెక్కింపు సరళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను వివరించారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల అదనపు పాలనాధికారులు కిషోర్‌కుమార్, శ్యామలాదేవి, నిర్మల్, భైంసా, ఉట్నూరు ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్‌రెడ్డి, జివాకర్, అధికారులు ల్గొన్నారు. 

దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌

నిర్మల్‌: జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జిల్లా పాలనాధికారి అన్నారు. సోమవారం దిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘ ముఖ్య కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సూచనలు చేశారు. అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్‌లో జరుగుతుందని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఇందులో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, అధికారులు, తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని