logo

‘మహా’ జొన్నలు మన రాష్ట్రానికి..!

మహారాష్ట్రలో పండిన జొన్నలు సరిహద్దులు దాటి మన రాష్ట్రంలో అమ్మకానికి వస్తున్నాయి. అక్కడి కంటే ఇక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.వేయి వరకు ధర ఎక్కువ ఉండటంతో దళారులు రంగప్రవేశం చేశారు.

Published : 28 May 2024 01:54 IST

తెలంగాణ సర్కారుపై క్వింటాలుకు రూ.వేయి భారం

కుభీరులో జొన్న కొనుగోలు కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు 

కుభీరు, న్యూస్‌టుడే: మహారాష్ట్రలో పండిన జొన్నలు సరిహద్దులు దాటి మన రాష్ట్రంలో అమ్మకానికి వస్తున్నాయి. అక్కడి కంటే ఇక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.వేయి వరకు ధర ఎక్కువ ఉండటంతో దళారులు రంగప్రవేశం చేశారు. కుభీరు మండలంలో వ్యవసాయశాఖ అధికారులు యాసంగి పంటల సాగు లెక్క విస్తీర్ణం లెక్కలను కూర్చున్నచోటే తప్పుగా నమోదు చేయడం, అంతర్‌రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు పనిచేయకపోవడం దళారులకు కలిసివచ్చినట్లు చెబుతున్నారు. కుభీరు మండలంలో 5,250 ఎకరాల్లో రైతులు జొన్న సాగుచేసినట్లు నమోదు చేశారు. వాస్తవానికి అంత విస్తీర్ణంలో సాగు చేయలేదని రైతులు చెబుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి వ్యవసాయ ఉత్పత్తులు అక్రమంగా తరలించకుండా సరిహద్దు గ్రామాల్లో మార్కెటింగ్, పోలీసుల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగా తయారయ్యాయి. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది లేకపోవడంతో మహారాష్ట్ర, తెలంగాణలోని దళారులు కలిసి అక్రమంగా జొన్నల వ్యాపారానికి తెర లేపారు. కుభీరు మండలంలో జొన్నపంట సాగు చేయకున్నా.. చేసినట్లు అన్‌లైన్‌లో పేర్లు నమోదైన రైతులను గుర్తించి, వారివద్దకు వెళ్లి నీపేరిట జొన్నలు తూకం వేస్తాం.. వచ్చే లాభం చెరిసగం పంచుకుందామంటూ బేరసారాలు చేస్తున్నారు. మార్కెట్‌లో జొన్నలకు వ్యాపారులు క్వింటాలుకు రూ.2,200 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రూ.3,180 ధర ఉంది. దాదాపు రూ.వేయి అధికంగా చెల్లించటంతో జొన్నల విక్రయానికి వాహనాలు బారులు తీరుతున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలైతే అనుమానం వస్తుందని, సరిహద్దుల్లో తెలంగాణ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాల్లోకి సరకు మారుస్తున్నట్లు తెలుస్తోంది. కుభీరు ప్రాంతంలోని జొన్నల కొనుగోళ్లు పది రోజుల క్రితమే ముగిసినట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చేదంతా మహారాష్ట్ర సరకుగా చెబుతున్నారు. ఇదే అదునుగా కుభీరు జొన్నల కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్ర జొన్నలు తూకం వేయటానికి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 20వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఒక్కో క్వింటాలుకు రూ.వేయి చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా ఉన్నతాధికారులు మిన్నకుండిపోవటం విమర్శలకు తావిస్తోంది. చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని కేటాయించి మహా జొన్నలు మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 

చెక్‌పోస్టులకు సిబ్బంది కొరత

ఈ విషయమై వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి గంగన్నను సంప్రదించగా.. సిబ్బంది లేక చెక్‌పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని