logo

కాలం చెల్లిన యంత్రం.. ఉత్పత్తిపై ప్రభావం

భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచేది సైడ్‌ డిశ్ఛార్జి లోడర్‌(ఎస్‌డీఎల్‌) యంత్రాలు. గనుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భాగంగా ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీఎల్‌ యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి.

Published : 28 May 2024 01:59 IST

ఎస్డీఎల్‌ యంత్రానికి మరమ్మతులు చేస్తున్న కార్మికులు 

న్యూస్‌టుడే, నస్పూర్‌ : భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచేది సైడ్‌ డిశ్ఛార్జి లోడర్‌(ఎస్‌డీఎల్‌) యంత్రాలు. గనుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భాగంగా ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీఎల్‌ యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి. వీటిలో ఎత్తు తక్కువగా ఉన్న పని ప్రదేశాల్లో ఎల్‌హెచ్‌డీఎల్‌ యంత్రాలు వినియోగించేవారు. ప్రస్తుతం గనుల్లో ఎస్డీఎల్‌ యంత్రాలనే పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తుండటం వీటి ప్రత్యేకత. పది మంది కార్మికులు మూడు బదిలీల్లో చేసే పనిని ఒక్క ఎస్డీఎల్‌ యంత్రం ఒకే బదిలీలో పూర్తి చేస్తుంది. కంపెనీ వ్యాప్తంగా శ్రీరాంపూర్‌ ఏరియాలోని రవీంద్రఖని-6 గనిలో ఒక యంత్రం రోజుకు సుమారు 115 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. భూగర్భ గనులు వార్షిక నిర్దేశిత లక్ష్యం చేరుకోవడం వీటి పనితీరు, వినియోగం పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనుల్లో వినియోగిస్తున్న యంత్రాల్లో చాలా వరకు సర్వే ఆఫ్‌(జీవిత కాలం పూర్తయినవి) ఉండటంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. దీని ఫలితంగానే ఏరియాలోని ఏడు భూగర్భ గనుల్లో మూడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుత వార్షిక లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

విడి భాగాల కొరత..

ఎస్డీఎల్‌ యంత్రాలకు వినియోగించే విడి భాగాల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని సందర్భాల్లో కొత్తవి సరఫరా లేకపోవడంతో పాత వాటినే మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. వీటిలో వినియోగించే ఆయిల్‌ నాసిరకంగా ఉండటంతో యంత్రాలు తక్కువ రోజుల్లోనే బ్రేక్‌ డౌన్‌(మరమ్మతులకు గురికావడం) అవుతున్నాయి. ఇలా రోజుల తరబడి యంత్రాలు నడవకుండా ఉండటంతో దాని ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడుతోంది. తరచూ ఇవి మరమ్మతులకు గురికావడంతో కార్మికులపై పనిభారం పెరుగుతోంది. ఏరియాలోని గనుల్లో వినియోగిస్తున్న అన్ని యంత్రాలు అయిదేళ్లు పైబడినవే. కొత్త యంత్రాలు తీసుకొస్తేనే బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రయోజనం చేకూరుతుంది. ఏరియా స్థాయి ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి కొత్త వాటిని తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆపరేటర్లకు అనారోగ్య సమస్యలు

సర్వే ఆఫ్‌ అయిన ఎస్డీఎల్‌ యంత్రాలను నడుపుతుండటంతో ఆపరేటర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పని స్థలాలకు బొగ్గు లోడింగ్‌ టబ్బులకు దూరం ఎక్కువగా ఉండటంతో వీరిపై పని ఒత్తిడి పెరుగుతుంది. కిందికి పైకి వీటిని నడిపేటప్పుడు, మార్గం ఎత్తు పల్లాలుగా ఉండటం, ఎక్కువ సమయం కూర్చోనే పని చేయాల్సి ఉండటంతో మెడ నరాలు, నడుం నొప్పులు, చేతుల వేళ్లు లాగడం వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. తమ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కొత్త వాటిని తీసుకురావాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పని భారం పెరుగుతోంది

- ఎం.సారయ్య, ఎస్డీఎల్‌ ఆపరేటర్, ఆర్కే-7

పాత యంత్రాలను నడిపేటప్పుడు పనిభారం పెరుగుతుంది. వీటివల్ల చాలా మంది ఆపరేటర్లు అనారోగ్యానికి గురవుతున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. యంత్రాలు సులభంగా నడిచేలా పనిస్థలాలు సిద్ధం చేయాలి. యంత్రాల విడి భాగాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. బ్రేక్‌ డౌన్‌ లేకుండా వీటికి ఎప్పటికప్పుడూ మరమ్మతులు చేపట్టాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని