logo

అంతరాయాలు ఆగినట్టేనా?

వేసవి తీవ్రతతో భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం అవుతోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు ఆ సంస్థ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. ఈ ఏడాది మొదట్లో తరచూ ఇష్టారీతిన సరఫరా నిలిపివేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి.

Published : 28 May 2024 02:01 IST

విద్యుత్తు సంస్థ ప్రత్యేక కసరత్తు పూర్తి 

జీజీహెచ్, ఎంసీహెచ్‌లలో విద్యుత్తు సరఫరాపై పర్యవేక్షణాధికారితో చర్చిస్తున్న విద్యుత్తు సంస్థ జిల్లా ప్రత్యేక బృందం 

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే : వేసవి తీవ్రతతో భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం అవుతోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు ఆ సంస్థ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. ఈ ఏడాది మొదట్లో తరచూ ఇష్టారీతిన సరఫరా నిలిపివేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఆ లెక్కలు చూస్తే జిల్లానే మొదటిస్థానంలో ఉండటంతో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అసహనం వ్యక్తం చేసి ప్రత్యేక దృష్టిసారించారు. అందుకు తగ్గట్లుగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారిపైనే వేటు వేసి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అంతరాయాన్ని తగ్గించేందుకు సలహాలు, సూచనలు తెలియజేశారు. దీంతో కొన్నిరోజులుగా జిల్లా సిబ్బంది ఇబ్బందులను గుర్తించడంలో నిమగ్నమైంది. నిరంతర సరఫరాకు అవసరమైన చర్యలకు సిద్ధమైంది.

క్షేత్రస్థాయిలోనే జిల్లా ఉన్నతాధికారి.. 

ఇటీవల నూతన ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్‌కుమార్‌ జిల్లాపై మరింత శ్రద్ధ పెట్టారు. కొద్దిరోజులుగా పూర్తి సమయాన్ని కేటాయిస్తూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. స్వయంగా పరిశీలిస్తున్నారు. వాడకం పెరిగినా.. తగ్గినా.. వర్షాలు వచ్చినా.. గాలులు వీచినా సరఫరాలో ఏ మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడూలేనివిధంగా ముందస్తుగా జిల్లాలో పదిరోజులపాటు అంతరాయం వివరాలతో కూడిన షెడ్యూల్‌ విడుదల చేసి మరమ్మతుల పనులు చేపట్టారు. పదిరోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రతిఫలం లభించినట్లు కన్పిస్తోంది. నిత్యం ఇదే తీరుతో మెరుగైన సేవలందిస్తారా అనేది చూడాలి మరీ..

సర్కారు ఆసుపత్రుల్లో అప్రమత్తం

ఇటీవల ఎంజీఎం(వరంగల్‌) ఆసుపత్రిలో జరిగిన సంఘటనతో జిల్లాలోనూ విద్యుత్తు సంస్థ అప్రమత్తమైంది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఇక్కడి సర్కారు ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరా తీరును పరిశీలించడం ప్రారంభించారు. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు బృందంగా ఏర్పడి విద్యుత్తు తీగలు, నియంత్రికలు పరిశీలించారు. పెద్దాసుపత్రుల్లోని వార్డులు కలియతిరుగుతూ విద్యుత్తు వినియోగంపై ఆరా తీస్తూ పర్యవేక్షకులతో సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి పరిస్థితిని గమనించి అంతరాయం కలిగించే అంశాలపై అప్రమత్తత చేసేలా అవసరమైన సలహాలిచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సమాచారం అందించాలని, తమ సిబ్బంది తోడ్పాటుతో సరఫరాకు ఆటంకం కలగకుండా చూద్దామంటూ భరోసానిచ్చారు. 

సరఫరాకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు

- శ్రావణ్‌కుమార్, జిల్లా విద్యుత్తు సంస్థ పర్యవేక్షక ఇంజినీరు

గత పక్షం రోజులకు పైగా విద్యుత్తు అంతరాయం, సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాం. వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాం. ఇబ్బంది కలిగిస్తూ వేలాడుతున్న తీగలన్నీ దాదాపు సరిచేశాం. నియంత్రికలను పరిశీలిస్తూ కాలంచెల్లిన వాటిని తొలగించాం. అవసరమైన చోట నూతనంగా ఏర్పాటు చేశాం. ఉపకేంద్రాలను పరిశీలించి, అధిక లోడు పడుతున్న ఫీడర్లను ఉన్నతీకరించాం. జిల్లా వినియోగదారులకు ఇక ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు, మెరుగైన సేవలు అందిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని