logo

నూతన నేర చట్టాలపై అవగాహన పెంచుకోండి : ఎస్పీ

దేశంలో నేర, న్యాయవ్యవస్థను మార్చే చర్యల్లో భాగంగా కొత్తగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్‌-2023 చట్టాలు వచ్చే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని... ఎస్పీ కె.సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 28 May 2024 02:06 IST

చట్టాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ కె.సురేష్‌కుమార్

ఆసిఫాబాద్‌ అర్బన్, న్యూస్‌టుడే : దేశంలో నేర, న్యాయవ్యవస్థను మార్చే చర్యల్లో భాగంగా కొత్తగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్‌-2023 చట్టాలు వచ్చే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని... ఎస్పీ కె.సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ మూడు చట్టాలు భారత శిక్షాస్మృతి(ఐపీసీ)-1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)-1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872లను భర్తీ చేయనున్నాయని వివరించారు. కొత్త చట్టాలు నేరస్థులకు శిక్షవేయడంతోపాటు బాధితులకు న్యాయం అందించడంపై దృష్టిపెడతాయని వివరించారు. సత్వర న్యాయం అందించడం, న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడం వీటి లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్త చట్టాల వర్తింపు, నేరాల సంబంధిత కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు పోలీసుశాఖలో డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అవగాహనతో విధులు నిర్వహించడానికి ఈ శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టాలపై అవగాహన పెంచుకొని విధులను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. డీఆర్పీ రమేశ్, ఎస్‌బీ ఎస్సై రామకృష్ణ, ఏఎస్‌ఐ జమీల్‌ పాషా రాష్ట్రస్థాయిలో శిక్షణ పొంది ఇక్కడి వారికి శిక్షణనీయనున్నారని చెప్పారు. జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మొత్తం 40మంది మొదట శిక్షణనిస్తున్నట్లు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని