logo

నిర్వహణ బరువు.. ఎరువు కరవు

ఖాళీగా ఉన్న కెరమెరి మండలంలోని  అనార్‌పల్లి సెగ్రిగేషన్‌ షెడ్డు ఇది. ఇక్కడ చెత్త సేకరించినట్లు కనిపించడంలేదు. ఎరువుల తయారీ జరగడంలేదు. 

Published : 28 May 2024 02:12 IST

వృథాగా సెగ్రిగేషన్‌ షెడ్లు

ఖాళీగా ఉన్న కెరమెరి మండలంలోని  అనార్‌పల్లి సెగ్రిగేషన్‌ షెడ్డు ఇది. ఇక్కడ చెత్త సేకరించినట్లు కనిపించడంలేదు. ఎరువుల తయారీ జరగడంలేదు. 

బెజ్జూరు, ఆసిఫాబాద్, న్యూస్‌టుడే : గ్రామాల్లో సేకరించిన చెత్త ద్వారా ఎరువులు తయారు చేయడంతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుంది. మరోవైపు గ్రామాలు పరిశుభ్రంగా మారుతాయనే సదుద్దేశంతో.. గత ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ నిధులతో పంచాయతీల్లో సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. అయితే ఆచరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఎరువులు తయారు చేస్తున్నా.. ఎక్కువ మొత్తంలో షెడ్లు ఖాళీగానే ఉన్నాయి. అధికారులు మాత్రం అంతటా ఎరువులు తయారు చేస్తున్నట్లు చెబుతుండటం గమనార్హం. ‘న్యూస్‌టుడే బృందం’ పలుచోట్ల పరిశీలించింది. 

జిల్లాలోని 15 మండలాల్లో 334 పంచాయతీలు, రెండు పురపాలిక సంఘాలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో డంపింగ్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. షెడ్ల నిర్మాణాలకు రూ.8.29 కోట్లు ఖర్చు చేశారు. షెడ్లలో ఎరువుల తయారీ కోసం రెండు పెద్ద టాంకీలతోపాటు ప్లాస్టిక్, ఇనుము, కాగితాలు, సీసాలు.. ఇలా ఒక్కో వ్యర్థాన్ని ఒక్కో దానిలో వేసేలా ప్రత్యేక అరలను నిర్మించారు. ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా నిత్యం సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి సెగ్రిగేషన్‌ షెడ్లలో వేసి ఎరువులు తయారు చేయాలి. కానీ జిల్లాలో మెజారిటీ పంచాయతీల్లో ఎరువుల తయారీ జరగడం లేదు. కొన్నిచోట్ల  సిబ్బంది యార్డుల్లో చెత్తవేసి వెళుతున్నారు. వేరు చేసే సిబ్బంది లేకపోవడమూ తయారీకి అడ్డంకిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల యార్డుల్లోనే చెత్తకు నిప్పుపెడుతున్నారు. 

గతంలో భేష్‌..

గతంలో జిల్లా అధికారుల ప్రత్యేక చొరవతో కొన్ని పంచాయతీల్లో ఎరువులు తయారు చేసి విక్రయించారు. మొక్కల పెంపకానికి వినియోగించారు. తర్వాత మార్కెటింగ్‌ వసతి లేకపోవడం, పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో తయారీ నామమాత్రంగా మారింది. ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సేంద్రియ ఎరువుల తయారు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో కొన్నిచోట్ల దృష్టి సారించారు. త్వరలో హరితహారం మొక్కల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఎరువులు అవసరమవుతాయి. ఇప్పటికైనా జిల్లాలో పూర్తి స్థాయిలో తయారు చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. 

ది బెజ్జూర్‌ మండల కేంద్రంలోని సెగ్రిగేషన్‌ షెడ్డు. పక్కనే డంపింగ్‌ యార్డులో చెత్త ఇష్టానుసారంగా పడేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరుచేసి షెడ్డులో వేయడంలేదు. దీంతో ఎరువుల తయారీ లేక నిరుపయోగంగా మారింది. మండలంలో 22 పంచాయతీల్లో ఇదే పరిస్థితి .

ఇది వాంకిడి మండలం చిచ్చుపల్లి సెగ్రిగేషన్‌ షెడ్డు. ఇక్కడి అరలన్నీ ఖాళీగా ఉన్నాయి. మండలంలో 28 పంచాయతీలుండగా.. దాదాపు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి.  

ఇది చింతలమానెపల్లి మండలం  బాబాసాగర్‌ గ్రామ శివారులోని వాగులో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్డు. పదుల సంఖ్యలో ప్లాస్టిక్‌ సీసాలను కొన్ని అరల్లో వేసి ఉంచారు. కానీ ఎరువులు తయారు చేసిన దాఖలాలు కనిపించడంలేదు. వీటినే చూపి తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇది ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌ పంచాయతీలోని సెగ్రిగేషన్‌ షెడ్డు. వివిధ వ్యర్థాలను వేరు చేసి ఉంచేలా ప్రత్యేక  అరలను నిర్మించారు. ఎరువుల తయారీ కోసం రెండు పెద్ద టాకీలను నిర్మించారు. కానీ వీటిని వినియోగించడం లేదు. 

ఎరువులు తయారు చేయించేలా చర్యలు

సురేందర్, డీఆర్‌డీఓ

ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌యార్డ్‌లకు తరలించి, సెగ్రిగేషన్‌ షెడ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. తయారైన వాటిని రైతులకు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై ఎంపీడీఓలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఎరువులు తయారు చేయించాలని సూచిస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని