logo

అనిశా దూకుడు!

స్టేషన్‌ బెయిల్‌ కోసం ఆసిఫాబాద్‌ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు తీసుకుంటుండగా.. గత నెలలో అనిశా అధికారులకు చిక్కారు. నాలుగు వరుసల రహదారి పరిహారం చెల్లింపుల్లో భాగంగా గత నెల నుంచి అనిశా అధికారుల విచారణ.. జిల్లాలో కొనసాగుతోంది.

Published : 28 May 2024 02:15 IST

వరుస దాడులతో.. అక్రమార్కుల్లో వణుకు

స్టేషన్‌ బెయిల్‌ కోసం ఆసిఫాబాద్‌ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు తీసుకుంటుండగా.. గత నెలలో అనిశా అధికారులకు చిక్కారు. నాలుగు వరుసల రహదారి పరిహారం చెల్లింపుల్లో భాగంగా గత నెల నుంచి అనిశా అధికారుల విచారణ.. జిల్లాలో కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.4 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారనే అభియోగంతో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో మూడు రోజుల నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటూ వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులతోపాటు, స్థిరాస్తి వ్యాపారులపై కేసు సైతం సైతం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరందరూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తునట్లుగా సమాచారం. 

ఈనాడు, ఆసిఫాబాద్‌: కాసులకు అలవాటుపడిన అధికారులపై వల విసురుతూ, పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగించడంతోపాటు, నెల రోజుల వ్యవధిలోనే.. జిల్లాలోని ఇద్దరు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారుల దూకుడు కొనసాగుతోంది. విచారణ సాగుతున్న ఓ కేసులో నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రయత్నాలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. వ్యవసాయశాఖలో కలుపు మొక్కలుగా మారిన ఓ అధికారి ఎరువుల దుకాణం రెన్యూవల్‌ కోసం రూ.38 వేలు తీసుకుంటూ తాజాగా అనిశా అధికారులకు చిక్కగా.. ఎరువుల దుకాణాల అనుమతులను రెండేళ్ల నుంచి పునరుద్ధరణ చేయని జైనూర్‌ ఏఓ ఈ నెల ఒకటో తేదీన సస్పెండ్‌ అయ్యారు. 

జిల్లాలో అధికారికగా 349 ఎరువుల దుకాణాలు ఉండగా.. పల్లెల్లో విచ్చలవిడిగా ఎరువుల దుకాణాలు వెలుస్తున్నాయి. పురుగుమందుల గురించి కనీస అవగాహన లేని నిర్వాహకులు.. అమాయక రైతులను నట్టేట ముంచుతూ అధిక ధరలకు ఎరువులను అంటగడుతున్నారు. డీలర్లకు సైన్సులో డిగ్రీ లేదా వ్యవసాయ డిగ్రీ అర్హత తప్పనిసరై ఉన్నా.. చాలా చోట్ల ఈ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దుకాణాలను ఏటా రెన్యూవల్‌ చేయాల్సి ఉండగా.. సంబంధిత అధికారులు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్‌లలో ఎరువుల దుకాణాలను ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్‌(యు), కెరమెరి, లింగాపూర్‌ మండలాల్లో అధిక ధరలకు, అధిక మోతాదులో ఎరువులను విక్రయిస్తూ అన్నదాతలను నిలవుదోపిడీకి గురి    చేస్తున్నారు. 

అధికారులు అలా.. దుకాణదారులు ఇలా..

ఎరువులు, పురుగుమందులతోపాటు, విత్తన విక్రయాలకు సంబంధించి రెండు వేర్వేరు లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది దుకాణదారులు ఏదో ఒక లైసెన్స్‌తో నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సంబంధిత అధికారులు.. రెన్యూవల్‌ విషయంతో పాటు, అధిక ధరల విక్రయాలను నిరోధించలేకపోతున్నారు. ఏ దుకాణంలో ఎంత మేరకు విత్తన, ఎరువుల నిల్వలు ఉన్నాయి, ఏ రకం ఎంత ధర అనే బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో అన్నదాతలకు అరువుపై విత్తనాలు, ఎరువులను ఇస్తున్న యజమానులు.. వారి ఇష్టానుసారంగా, అధిక లాభాలు గడించే వాటినే అంటగడుతున్నారు. 

గతంలో దహెగాం మండలంలో పట్టుబడిన ముగ్గురు అధికారులు

దహెగాం: మండలంలో ఇద్దరు తహసీల్దార్లు ఒక వ్యవసాయాధికారి పట్టుబడ్డారు. 24-4-2013లో తహసీల్దార్‌ అమృతసాగర్‌ కాగజ్‌నగర్‌ తన నివాసంలో లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. మరో తహసీల్దార్‌ విశ్వంబర్‌ 2-5-2016లో తన నివాసంలో లంచం తీసుకుని చిక్కాడు. తాజాగా వ్యవసాయాధికారి మండలకేంద్రంలో లంచం తీసుకుంటున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. 

గతంలోనూ సస్పెండయ్యారు..

ఎరువుల దుకాణం పునరుద్ధరణకు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన దహెగాం ఏఓ వంశీకృష్ణ.. ఆది నుంచి ఇదేతీరుతో దారి తప్పి వ్యవహరిస్తున్నారు. 2019లో మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏఓగా పనిచేస్తున్న క్రమంలో.. రైతుబీమా పరిహారం మంజూరులో సైతం బాధితుల నుంచి ముడుపులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే ‘ఈనాడు’ బహిర్గతం చేయగా, అప్పటి పాలనాధికారి భారతీ హోళ్లికేరి స్పందించి విచారణ చేశారు. డబ్బుల వసూళ్ల గురించి బాధితులు పూర్తి వివరాలు వెల్లడించడంతో మరో ఇద్దరు వ్యవసాయ శాఖాధికారులతోపాటు, వంశీకృష్ణ సస్పెండయ్యారు. అనంతరం మూడేళ్ల తరువాత 2022లో దహెగాం మండల ఏఓగా బాధ్యతలు స్వీకరించినా మళ్లీ బుద్ధిమారక లంచాలు తీసుకుని అనిశాకు చిక్కారు. 

నిర్భయంగా అనిశా అధికారులను సంప్రదించవచ్చు

ఏ అధికారి అయినా లంచం తీసుకుంటే నిర్భయంగా అనిశా అధికారులను సంప్రదించవచ్చని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అవినీతి జరుగుతుందని తెలిస్తే 1064, 91543 88954, 91543 88963 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు