logo

ఆకట్టుకునేలా.. ఆసక్తి పెంచేలా..

ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. శ్రద్ధపెడితే కష్టమంటూ ఏదీ ఉండదు. మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలంటే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా  ఆలోచన చేయాలి. చదువు విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది.

Published : 28 May 2024 02:24 IST

ఇలా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపునకు ప్రయత్నించాలి

ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. శ్రద్ధపెడితే కష్టమంటూ ఏదీ ఉండదు. మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలంటే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా  ఆలోచన చేయాలి. చదువు విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. చక్కని వనరులూ, అర్హులైన బోధకులుండే సర్కారు బడులపై ఆసక్తి పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. కొన్నిచోట్ల చక్కని ప్రణాళికతో ఉత్సాహం నింపుతూ తల్లిదండ్రుల్లోనూ మంచి అభిప్రాయం కలిగిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపులో ఉపాధ్యాయులు సఫలీకృతులవుతున్నారు.

న్యూస్‌టుడే, మామడ

భాగస్వామ్యం అవసరం  

గ్రామీణ ప్రాంత ప్రజలకూ ప్రైవేటు పాఠశాలలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రతి ఊరి నుంచి విద్యార్థులను తీసికెళ్లేందుకు విద్యా సంస్థల వాహనాలు వస్తున్నాయి. ఆర్థికంగా భారమవుతున్నా కొందరు అక్కడ చక్కని విద్య అందుతుందన్న ఆలోచనతో అటు వైపు వెళ్తున్నారు. ఇందులో మార్పు రావాలంటే మన పాఠశాలల్లో మంచి బోధన అందించాలి. బడుల్లో పోషకుల భాగస్వామ్యం ఉండే కార్యక్రమాలు నిర్వహించాలి. 

అక్కడ అన్నీ ఆసక్తిగా..

ప్రతి నెలా నాలుగో శనివారం పుస్తకాల సంచి లేకుండా పిల్లలు బడికి రావాలని గత విద్యా సంవత్సరం నుంచే విద్యాశాఖ ‘నో బ్యాగ్‌ డే’ను ప్రవేశ పెట్టింది. తాజాగా ఇప్పుడూ మళ్లీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇన్నాళ్లు దీనిని వేళ్ల మీద లెక్కించేన్ని పాఠశాలల్లోనే అమలు చేశారు. అందులో మామడ మండలం కొరటికల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆదర్శంగా చెప్పొచ్చు. ప్రతి నెల ఒక ప్రత్యేకతతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. చదువేతర కార్యక్రమాలతో పండగ వాతావరణం కల్పించారు. డిజిటల్‌ తరగతుల నిర్వహణ, విజ్ఞాన విహార యాత్రలు ప్రైవేటు తరహాలో ఉంటాయి. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌ నిర్వహణలో ఆదర్శంగా నిలిచారు. కేరళ, హరియాణా రాష్ట్రాల ప్రజల వేషధారణ, వారి దినచర్యలను అనుకరిస్తూ పిల్లలు  చేసిన కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చింది.


నో బ్యాగ్‌ డే రోజున వంటకాలతో పిల్లలు

పొన్కల్‌ సిగలో ఎన్‌సీసీ నగ

మామడ మండలం పొన్కల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్తే విద్యార్థులతో కళకళలాడుతుంది. 550 మంది పిల్లలు చదువుకుంటున్నారంటే మాటలు కాదు. ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఎన్‌సీసీ ఆ బడికి కీర్తి కిరీటంగా నిలుస్తోంది. కేడెట్లు నిర్వహించే పరేడ్‌ చూస్తే గ్రామానికి ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి కవాతు చేస్తున్నాయా అనిపించే రీతిలో ఉంటుంది. జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లు, హాజరు బాగున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులకు బహుమతులు, సందర్భాన్ని బట్టి ప్రత్యేక కార్యక్రమాలు ప్రైవేటుకు దీటుగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల అంకితభావానికి గ్రామస్థుల సహకారం లభిస్తుండడంతో చక్కని ప్రగతి కనిపిస్తోంది.


పరేడ్‌ నిర్వహిస్తున్న విద్యార్థులు

సరిహద్దు బడి.. చక్కని ఒరవడి..

మహారాష్ట్ర సరిహద్దున ఉండే తానూరు మండలం కల్యాణి ప్రాథమిక పాఠశాలలో చేపట్టే కార్యక్రమాలను ఆదర్శంగా చెప్పొచ్చు. బడికి భవనం లేకున్నా తాత్కాలికంగా రైతు వేదికలో తరగతులు నిర్వహిస్తున్నా పిల్లల సంఖ్య పెంపులో ఉపాధ్యాయులు అజహర్, బాలాజీ కృషి అభినందనీయం. పిల్లల సంఖ్య 8 నుంచి 60 మందికి చేరిందంటే మాటలా మరి. బడిలో ఏటా నిర్వహించే ఫుడ్‌ఫెస్టివల్‌ ఆకట్టుకుంటుంది. ఆ రోజు ఊరంతా పాఠశాలకు వస్తుంటారు. ఉపాధ్యాయ దినోత్సవం. బతుకమ్మ సంబరాలు, రైతు దినోత్సవం వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి. గ్రామస్థులను భాగస్వాములను చేయడంతో ప్రతిదీ విజయవంతమవుతోంది.  


ఫుడ్‌ ఫెస్టివల్‌లో కల్యాణి పాఠశాల చిన్నారులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని