logo

సౌకర్యాలు సరే.. బోధకులేరి?

జిల్లాలో ఒకవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సమస్యగా మారనుంది. బడుల పునఃప్రారంభానికి ఇంకా పక్షం రోజులే గడువు ఉండటం..

Published : 28 May 2024 02:30 IST

సర్కారు బడుల్లో వేధిస్తున్న టీచర్ల కొరత

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : జిల్లాలో ఒకవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సమస్యగా మారనుంది. బడుల పునఃప్రారంభానికి ఇంకా పక్షం రోజులే గడువు ఉండటం.. బోధకుల కొరతను తీర్చేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు ఎప్పటి మాదిరిగానే తిప్పలు తప్పేలా లేవు.

జిల్లాలో 648 పాఠశాలలు ఉండగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 2,423 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సర్కారు బడుల బాగు కోసం నడుం బిగించింది. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టింది. జిల్లాకు రూ.30 కోట్లు కేటాయించింది. దాదాపు పనులు తుది అంకానికి చేరుకున్నాయి. విద్యార్థులు పాఠశాలలు అడుగుపెట్టేనాటికి ఆహ్లాదకర వాతావరణం, ఆకర్షించేలా రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. అయితే జిల్లాలో విద్యార్థులకు బోధించేవారే లేక చదువులు చతికిలపడుతున్నాయి. 

818 మంది అనుత్తీర్ణులయ్యారు..

కిందటి విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో 818 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ఇందులో బోధకుల కొరత ఉన్న సర్కారు బడుల్లో చదివే విద్యార్థులే అత్యధికులు ఉండటం గమనార్హం. తెలుగు, ఆంగ్లం సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యధికులు ఫెయిల్‌ కావడం బోధకుల కొరత తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగులో 322 మంది, హిందీలో 43 మంది, ఆంగ్లంలో 306 మంది, గణితంలో 189 మంది, సైన్సులో 243 మంది, సోషల్‌ సబ్జెక్టులో 96 మంది అనుత్తీర్ణులయ్యారు.

ప్రత్యామ్నాయ చర్యలు కరవు

కొత్త ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు ముందుకొచ్చినా.. ఎన్నికల పుణ్యమాని ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా విద్యావాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గత ప్రభుత్వం మాదిరి సర్దుబాటు ప్రక్రియ కొనసాగిస్తారా? లేదా? అన్నది తేలలేదు. పీజీహెచ్‌ఎం పదోన్నతులతో స్కూల్‌ అసిస్టెంటు పోస్టులు ఖాళీగా మారాయి. పదోతరగతి విద్యార్థులకు బోధించేవారు కరవయ్యారు. 

రూ.6.60 లక్షలు ఖర్చు చేసి..: భీంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రహరీ, మూత్రశాలలు, తాగునీరు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.6.60 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఇక్కడ కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో హెచ్‌ఎం శిల్ప ఇప్పటికే బదిలీ అయి రిలీవర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వెళ్తే ఇద్దరు మిగులుతారు. ప్రధానమైన గణితం, సైన్సు, సోషల్, తెలుగు సబ్జెక్టులను బోధించేవారు లేరు. విద్యావాలంటీర్లు లేక మూడేళ్లుగా వేరే పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.

రెండు తరగతులను ఒకే గదిలో..: బోధకుల కొరత కారణంగా భీంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో రెండు తరగతుల విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక తరగతికి పాఠం చెబుతుండగా, మరోతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది.

ఎలాంటి ఆదేశాలు రాలేదు 

ప్రణీత, డీఈవో 

విద్యావాలంటీర్ల నియామకానికి సంబంధించి మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. సర్దుబాటు విషయంలోనూ సమాచారం ఇంకా రాలేదు. ప్రభుత్వ ఆదేశాలను బట్టి బడుల్లో బోధకుల కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని