logo

మత్తు వదిలించే కేంద్రాలెక్కడ?

మాదక ద్రవ్యాలు, మద్యం తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన బాధితులను ఆ వ్యసనం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉమ్మడి జిల్లాలో డీ అడిక్షన్‌ కేంద్రం ఆదిలాబాద్‌లో మాత్రమే ఉంది.

Updated : 28 May 2024 06:19 IST

ఉమ్మడి జిల్లాలో ఉన్నది ఒకటే 

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం : మాదక ద్రవ్యాలు, మద్యం తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన బాధితులను ఆ వ్యసనం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉమ్మడి జిల్లాలో డీ అడిక్షన్‌ కేంద్రం ఆదిలాబాద్‌లో మాత్రమే ఉంది. మిగతా మూడు జిల్లాల్లో కేంద్రాలే లేవు. ఆదిలాబాద్‌లో డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఫర్‌ విలేజ్‌ ఎన్విరాన్‌మెంట్(డోవ్‌) సంస్థ ఐఆర్‌సీఏ(ఇంటిగ్రేటెడ్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ ఫర్‌ అడిక్షన్‌) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల నుంచి బాధితులను పోలీసులు ఆదిలాబాద్‌లోని డోవ్‌ కేంద్రానికే తరలిస్తుంటారు. ఏటా మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారు వేలల్లో ఉన్నా జిల్లాకో కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వానికి మద్యం అమ్ముకొని ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ వారి ఆరోగ్యంపై లేదనే విమర్శలున్నాయి. 

డోవ్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 15 మంది చొప్పున ఏడాదికి దాదాపు 180 మంది బాధితులకు ఈ కేంద్రంలో కౌన్సెలింగ్, మానసిక, శారీరక చికిత్సలను అందిస్తున్నారు. 2005లో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఇప్పటి వరకు దాదాపు 3,500 మంది బాధితులకు సేవలందించారు. తరచూ గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మరో కేంద్రం గతేడాది జూన్‌లో మంజూరు అయినా ఆశించిన స్థాయిలో మాత్రం సేవలందించలేకపోతోంది. 

పల్లె, పట్టణం తేడా లేకుండా..

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలు మహారాష్ట్రకు దగ్గరగా ఉండటంతో గంజాయి, గుట్కా వాడకం ఎక్కువగా ఉంటోంది. పల్లెపల్లెకు, వాడవాడలా మద్యం గొలుసు దుకాణాలు వెలిసి యువత వీటికి బానిసలుగా మారుతున్నారు.

డోవ్‌ కేంద్రంలో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ కేంద్రం నిర్వాహకులు మరో 15 పడకల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. 

భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

సంవత్సరాల వారీగా పెరుగుతున్న మద్యం విక్రయాలను బట్టి చూస్తే ఎంత మంది వ్యసనానికి బానిసలుగా మారుతున్నారో అవగతమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2022తో పోల్చుకుంటే 2023లో రూ.70.03 కోట్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఈ ఏడాది అయిదు నెలల కాలంలోనే రూ.640.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటే మద్యానికి అలవాటు పడే వారి సంఖ్య ఏ మేరకు పెరిగిపోతుందో అవగతమవుతోంది. వీటికి తోడు గంజాయి, గుట్కా వ్యవసపరులు అదనం.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ.. 

పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో నిర్వహిస్తున్న డోవ్‌ స్వచ్ఛంద సంస్థ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న చిత్రమిది. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను కథల రూపంలో తరగతి గదిలో అవగాహన కల్పిస్తారు. వారి ఆరోగ్యం మెరుగుపర్చటానికి అవసరమైన చికిత్స సైతం ఇందులో అందిస్తున్నారు. నెల రోజులపాటు వారికి కౌన్సెలింగ్‌ చేసి ఆ దురలవాటును మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెల కనీసం 15 మందికి ఈ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. 

అవగాహన, చికిత్స అందజేస్తున్నాం  

చంద్రశేఖర్‌రెడ్డి, డోవ్‌ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌

మాదక ద్రవ్యాలకు, మద్యానికి, గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారిన వారికి పునరావాసం కల్పించి కౌన్సెలింగ్‌ చేయటంతో పాటు వారికి చికిత్సలు, మందులు సైతం కేంద్రంలో అందజేస్తున్నాం. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని మా కేంద్రానికి తీసుకొస్తే వాటిని మాన్పించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని