logo

ఓటర్ల నిరాసక్తత

ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు.

Published : 01 Dec 2023 04:22 IST

జిల్లాలో తగ్గిన పోలింగ్‌

ఓటు వేయండంటూ గ్రామస్థులతో మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి కిశోర్‌కుమార్‌

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు. చాలామంది ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నిర్మల్‌ జిల్లా పరిధిలో ఓటింగ్‌ శాతం తగ్గిపోయింది. ప్రజల్లో చైతన్యం పెరిగినట్లే కనిపించినా.. అది క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటమవ్వలేదు. ఓటింగ్‌గా మారలేదు.

అంతటా అదే పరిస్థితి..

జిల్లాలోని చదువుల తల్లి కొలువైన నిర్మల్‌ జిల్లాలో ఈసారి జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్‌ కూడా నమోదవకపోవడం గమనార్హం. జిల్లా పరిధిలో పురుషులు 3,50,509 కాగా, మహిళలు 3,72,829, ఇతరులు 51 మంది చొప్పున మొత్తం 7,23,389 ఓటర్లున్నారు. మొత్తంగా 78 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. అంటే.. దాదాపు 5.64 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలలో ప్రతీ ఓటు కీలకం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బాధ్యతను విస్మరించొద్దనే ప్రచారం జోరుగా జరిగింది. అయినా.. మూడు నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది.

పట్టణవాసుల్లో అలసత్వం..

దాదాపు రెండు నెలలుగా అధికారులు ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులకున్న బృహత్తరమైన బాధ్యత ఓటు. జాబితాలో పేరున్నవారంతా సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండినవారంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. చాలామంది ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓటు పొందినవారు వేయడానికి బద్ధకించారు. జిల్లా పరిధిలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణ ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో ఉన్న ఓటర్లలోనే ఈ అలసత్వం స్పష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, నిరక్షరాస్యులు, వయోవృద్ధులు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటివద్దకే ఓటింగ్‌ ప్రక్రియను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పట్టణవాసుల్లో ఓటింగ్‌ ప్రక్రియపై నైరాశ్యం కనిపించింది. ఈ కారణంగానే చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారు. అయితే.. కొత్తగా ఓటు పొందినవారు, ఉద్యోగ- ఉపాధి- విద్యావకాశాల నిమిత్తం దూరప్రాంతాల్లో ఉంటున్నవారిలో కొందరు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని