logo

పల్లె, పట్నం ఓటుకు కదిలె..

మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Published : 01 Dec 2023 04:38 IST

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ముల్కల్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటువేసే సమయం పూర్తయినప్పటికీ వరుసలో నిల్చున్న ఓటర్లు

మంచిర్యాల పట్టణం, బెల్లంపల్లి పట్టణం, చెన్నూరు, చెన్నూరు గ్రామీణం- న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించలేదు. పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామాల్లో చాలా చోట్ల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గం ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పోలింగ్‌ కేంద్రాలు తిరుగుతూ ఓటర్ల సరళి పరిశీలించారు. నస్పూరులోని పోలింగ్‌ కేంద్రంలో జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు, కుర్చీలు, తాగునీటి వసతి కల్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

హాజీపూర్‌ మండలం దొనబండలోని పోలింగ్‌ కేంద్రంలో బారులుతీరిన ఓటర్లు

మంచిర్యాలలో భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు నడిపెల్లి దివాకర్‌రావు, ప్రేమ్‌సాగర్‌రావు, వెరబెల్లి రఘునాథ్‌రావు, చెన్నూరు కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు గడ్డం వివేకానంద, దుర్గం అశోక్‌ ఓట్లు వేశారు. మందమర్రి మండలంలోని క్యాతనపల్లిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత, చెన్నూరు భారాస అభ్యర్థి బాల్క సుమన్‌ ఓట్లు వేశారు. బెల్లంపల్లి నియోజకర్గంలో భారాస, భాజపా అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, శ్రీదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌కు ఓటు హైదరాబాద్‌లో ఉండటంతో ఇక్కడ తన ఓటు తాను వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

గతంలో కన్నా తగ్గిన పోలింగ్‌ శాతం

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో గత ఎన్నికల కన్నా ఇప్పుడు పోలింగ్‌ శాతం తగ్గింది. 2018 నుంచి 2023 ఎన్నికల మధ్యలో ఓటర్ల నమోదు సంఖ్య భారీగా పెరిగింది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగిన ఇప్పుడు పోలింగ్‌ శాతం తక్కువ నమోదైంది. గతంలో లాగానే ఈసారి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ నమోదు తగ్గినట్టు తెలుస్తోంది.

పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడంతో ఈవీఎం యంత్రాలతో తరలివెళ్తున్న ఎన్నికల సిబ్బంది

మంచిర్యాలలోని అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఓటు కోసం బారులు తీరిన స్థానికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని