logo

ఓటు గల్లంతు..!

శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరుకు పోల్‌ చీటీ పంపిణీ చేయాలని ఆదేశించింది.

Updated : 01 Dec 2023 06:18 IST

జాబితాలో పేరు లేక పోల్‌ చీటీలు అందక ఇబ్బందులు

జాబితాలో పేర్లు చూసుకుంటున్న ఓటర్లు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరుకు పోల్‌ చీటీ పంపిణీ చేయాలని ఆదేశించింది. కానీ! చాలా మందికి పోల్‌ చీటీలు అందలేదు. జాబితాలో పేర్లు కనిపించకపోవడం.. కుటుంబంలోని అందరి ఓట్లు ఒకే బూత్‌లో పడకపోవడం.. వెరసి చాలా మంది ఓటు హక్కుకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో పలువురు ఓటర్లు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గురువారం జిల్లాలో జరిగిన పోలింగ్‌ సందర్భంలో ఇలాంటి సమస్యలు వెలుగు చూశాయి.

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,53,538 ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరుకు పోల్‌ చీటీలను ఎన్నికల సంఘమే ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు బూత్‌ స్థాయి అధికారులతో వీటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు సమావేశాల్లో చెప్పారు. కానీ పోలింగ్‌ సమయంలో చాలా మందికి అవి అందనట్లు స్పష్టమైంది. పోల్‌ చీటీలు అందకున్నా ఓటు వేసేందుకు ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులను వెంట పట్టుకొని ఎంతో మంది ఉత్సాహంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు సమాచారం తెలియజేసేందుకు బీఎల్‌ఓలను అందుబాటులో ఉంచారు. కానీ! చాలా మంది ఓటర్ల వివరాలు బీఎల్‌వోల వద్ద ఉన్న జాబితాల్లో పేర్లు గల్లంతు కావడం.. ఎంత వెతికినా దొరకకపోవడంతో వెనుతిరిగారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు కలిగిన వారికి అంతర్జాలంలో పరిశీలిస్తే కొందరివి లభించినా.. కొత్త కార్డుల వారికి సమాచారం దొరక్క ఇబ్బంది పడ్డారు. కొన్ని కుటుంబాల్లోని సభ్యుల ఓట్లు రెండు మూడు  పోలింగ్‌ కేంద్రాల్లో పడటంతో ఆచూకీ దొరక్క పలువురు ఓటు వేయలేకపోయారు.

ఫారం-12 ఇచ్చి చేతులు దులుపుకొన్నారు

జిల్లాలో దివ్యాంగుల ఓటర్లు 5831 మంది ఉన్నారు. వీరికి ఇంటి వద్దే ఓటు వేసేలా ముందస్తుగా ఈసారి ఫారం 12డి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీంతో జిల్లాలో అధికారులు కొంతమంది దివ్యాంగులకు ఫారం 12డి పంపిణీ చేశారు. వాటిని పూరించాక తిరిగి తీసుకోవాల్సి ఉండగా.. పట్టించుకోలేదు. దీంతో ఇంటి వద్ద లేవలేని, నడవలేని స్థితిలో ఉన్న వారు ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు.

మండలాల్లో ఇలా..

  • జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌, ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో వెనుతిరిగారు.
  • జైనూర్‌ మండలం జామ్నిలో ఇద్దరి ఓట్లు.. వాంకిడిలో పదులు సంఖ్యలో జాబితాలో పేర్లు లేక ఓటు వేయలేకపోయారు.
  • తిర్యాణి మండలం సుంగాపూర్‌ సర్పంచి పాండుబాయితో పాటు.. మరో 19 మంది ఓటర్ల పేర్లు తెలండి పోలింగ్‌ కేంద్రంలో పడ్డాయి. అది 10 కి.మీ దూరంలో ఉంది. మొదట సూంగాపూర్‌లో ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు.

జాబితాలో పేరు లేదంట..

మంతెన మంద, జన్కాపూర్‌

ఓటు వేసేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు జన్కాపూర్‌ పోలింగ్‌ కేంద్రానికి వచ్చా.  బీఎల్‌వోల వద్ద జాబితాలు పరిశీలించినా పేరు కనిపించలేదు. మండల కేంద్రంలోని మిగతా మూడు పోలింగ్‌ కేంద్రాల్లోని జాబితాలు పరిశీలించినా ఫలితం లేదు. గత ఎన్నికల్లో ఓటు వేశా. ఈసారి పేరు లేక దూరం కావాల్సి వచ్చింది.

పేరు లేదన్నారు..: ఎస్‌కె.భాషు

ఓటు వేసేందుకు ఉదయం 8 గంటలకు జన్కాపూర్‌ పోలింగ్‌ కేంద్రానికి వచ్చా. జాబితాలో పేరు లేదని చెప్పారు. సాయంత్రం వరకు వేచి చూశా. చివరకు వెనుదిరగాల్సి వచ్చింది.

ఫారం ఇచ్చారు.. పూరించలేదు: మొండి

మాది జన్కాపూర్‌. దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఫారం 12డిని ఇంటికి పంపించారు. భర్తీ చేశాక తీసుకెళతామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చా. నాలా చాలా మంది మంచానికే పరిమితమైన వారికి అధికారులు 12డి ఫారం పంపిణీ చేసినా.. తీసుకెళ్లకపోవడంతో వారంతా ఓటుకు దూరమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని