logo

అవకాశం కోసం ఆగాల్సిందే

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నేతలు నిరీక్షించాల్సిందే. దిల్లీ స్థాయిలో ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం సోదరులు వేర్వేరుగా  ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 08 Dec 2023 04:10 IST

మొదటివిడతలో మొండి చేయి..
మంత్రివర్గంలో చోటుకోసం పీఎస్‌ఆర్‌, గడ్డం సోదరుల యత్నాలు

ఈటీవీ - ఆదిలాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నేతలు నిరీక్షించాల్సిందే. దిల్లీ స్థాయిలో ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం సోదరులు వేర్వేరుగా  ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్‌,వివేక్‌ సోదరులు ఇప్పటికే దేశ రాజధానిలో అఖిల భారత కాంగ్రెస్‌(ఏఐసీసీ) అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహా కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.  దాదాపుగా దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్నందున ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో భరోసా కల్పించాలంటే మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేననే నిర్ణయానికి పరిశీలకుల బృందం వచ్చింది. అదే సమయంలో ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వర్గాలను నిరాశకు గురిచేయకూడదనే ఆలోచన చేస్తోంది. ఫలితంగానే మొదటి విడతలో ఎవరికీ అవకాశం రాలేదు. త్వరలోనే రెండో విడత విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఈలోగా ఇరువర్గాలతో చర్చించి సముచిత స్థానం కల్పించాలనే భావనలో పార్టీ ఉంది. ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌, వివేక్‌ విజయం సాధించిన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రాధాన్యాన్ని గుర్తించాలని కాంగ్రెస్‌ కీలక నేతల ఆలోచనగా కొనసాగుతోంది. ఖానాపూర్‌నుంచి విజయం సాధించిన వెడ్మ బొజ్జును మినహాయిస్తే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజకీయాలను ప్రభావితం చేయగలిగే సమర్థులే అనే ఆలోచన సైతం పార్టీలో చర్చకు వచ్చింది. పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుంటే వివేక్‌ పార్టీ మారినా వినోద్‌ 2018లో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలవడం మినహా పార్టీలోనే ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది. ప్రేమ్‌సాగర్‌రావు మాత్రం ఆది నుంచి పార్టీలోనే ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా హవా కొనసాగుతున్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు జవసత్వాలు తీసుకురావడంలో ప్రేమ్‌సాగర్‌రావు పాత్ర ఉన్నట్లుగా రాష్ట్రంలోని కొంతమంది కీలక నేతలు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ప్రభుత్వం కొలువుదీరడంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల నిర్ణయంతో తప్పకుండా ఒకరికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి పరిశీలకుల బృందం వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని