logo

తొలి ప్రయత్నం.. కేంద్ర కొలువు

డీఎడ్‌ పూర్తి చేసిన వారంతా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడలేదు. సీటెట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలోనే కేంద్ర కొలువులు సాధించారు.

Updated : 08 Dec 2023 06:38 IST

సత్తా చాటిన డైట్ పూర్వ ఛాత్రోపాధ్యాయులు

ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాల

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం : డీఎడ్‌ పూర్తి చేసిన వారంతా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడలేదు. సీటెట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలోనే కేంద్ర కొలువులు సాధించారు. ఇటీవల కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా యువతీ, యువకులు సత్తా చాటారు. వీరంతా ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణా సంస్థ(డైట్) పూర్వ ఛాత్రోపాధ్యాయులు కావడం విశేషం. ఈ నేపథ్యంలో వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. 

కేరళలో  ఉద్యోగం..

ఆర్‌.సౌజన్య, పులిమడుగు, ఆదిలాబాద్‌జిల్లా

రెండేళ్ల కిందటే(2019-21) డీఎడ్‌ పూర్తి చేశాను. సీటెట్ అర్హత సాధించిన ఏడాదిలోనే కేంద్రీయ విద్యాలయ కొలువుకు దరఖాస్తు చేసుకున్నా. తొలిప్రయత్నంలోనే కేరళలోని చెన్నెర్‌కరా విద్యాలయంలో పోస్టింగు లభించింది. దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళలో కొలువు రావడం చాలా ఆనందంగా ఉంది. స్వయంకృషిని నమ్ముకుంటే అనుకున్న లక్ష్యం చేరవచ్చు.

కూలీ బిడ్డ.. ఇక పంతులమ్మ  

మనీషా, కౌటాల, ఆసిఫాబాద్‌ జిల్లా

మా నాన్న కూలి డబ్బులే మా కుటుంబానికి జీవనాధారం. చదువొక్కటే కష్టాలు దూరం చేస్తుందని భావించా. 2018-20లో డీఎడ్‌ పూర్తి చేసి సీటెట్లోనూ అర్హత సాధించా. దినపత్రికలతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలతో కేంద్ర కొలువుకు సన్నద్ధమై విజయం సాధించా. పొరుగు జిల్లా కరీంనగర్‌లో పోస్టింగ్‌ రావడం మరింత ఆనందంగా ఉంది.

ఉపాధ్యాయుల మార్గదర్శనంలో..

రాఠోడ్‌ శ్రీకాంత్‌, డొదర్నా, నిర్మల్‌ జిల్లా

తొలి ప్రయత్నంలో సంగారెడ్డి కేంద్రీయ విద్యాలయంలో కొలువు సాధించాను. డైట్లో 2015-17 సంవత్సరంలో డీఎడ్‌ పూర్తి చేసి ఉపాధ్యాయుల, సీనియర్ల సలహాలతో సీటెట్లో అర్హత సాధించి కేంద్ర పరిధిలోని ఉపాధ్యాయుల కొలువులపై దృష్టి సారించాను. యూట్యూబ్ సాయంతో పరీక్షకు సన్నద్ధమయ్యాను. లక్ష్యం సాధించే వరకు ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.

కలిసొచ్చిన సన్నద్ధత

ఆర్తి రాఠోడ్‌, దివ్యానగర్‌, నిర్మల్‌ జిల్లా

డీఎడ్‌ 2017-19లో పూర్తి చేసి డిగ్రీలో చేరా. ఇదే సందర్భంలో ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యా. పరీక్షలు వాయిదా పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ టీచరు నోటిఫికేషన్‌ రాగా.. దరఖాస్తు చేసుకున్నా. తొలిప్రయత్నంలో కర్ణాటకలోకి బల్లారి కేంద్రీయ విద్యాలయంలో పోస్టింగ్‌ రావడం సంతోషంగా ఉంది.

మధ్య తరగతి మాణిక్యం

ఆత్రం విజ్ఞానిక, ఎల్‌బీఎస్‌నగర్‌, ఆదిలాబాద్‌

మధ్య తరగతి కుటుంబం మాది. డైట్లో 2018-20లో డీఎడ్‌ పూర్తి చేసి తొలి ప్రయత్నంలో పొరుగు రాష్ట్రమైన విశాఖపట్టణంలో కొలువు సాధించాను. చదవడం కాకుండా నేర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చా. ఇష్టంగా సన్నద్ధమయ్యా. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మన కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లాలి. తెలుగురాష్ట్రంలోనే కొలువు రావడం ఎంతో సంతోషంగా ఉంది.

అమ్మ బాటను ఎంచుకుని

సంధ్య, బోయవాడ, ఉట్నూరు

టీచరుగా పని చేస్తున్న అమ్మను స్ఫూర్తిగా తీసుకుని కేంద్రీయ కొలువు సాధించా. గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్‌టీగా పని చేసిన అనుభవం పనికొచ్చింది. తొలి ప్రయత్నంలో తెలుగు రాష్ట్రం విశాఖపట్టణంలో తొలి పోస్టింగు లభించడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివితే ఏదో ఒకరోజు అనుకున్నది సాధించడం సులువే.

ఒకేసారి ఏడుగురికి..

డా.ఎ.రవిందర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌, డైట్, ఆదిలాబాద్‌

ఒకేసారి ఏడుగురు పూర్వ ఛాత్రోపాధ్యాయులకు కేంద్రీయ విద్యాలయాల్లో కొలువులు దక్కడం గర్వంగా ఉంది. సీటెట్(సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)పై శిక్షణ సమయంలోనే తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఇది వరకు కొలువులు సాధించిన సీనియర్లతో సూచనలు ఇప్పించడం తాజా ఫలితాలకు నిదర్శనం. అందరికీ డైట్ తరఫున ప్రత్యేక అభినందనలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని