logo

నిర్వహణ కొరవడి.. పొగబారిన పడి..

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామాల్లో వెలువడే చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు డంపింగ్‌ యార్డులు, సేంద్రియ ఎరువుల తయారీ పథకాలకు శ్రీకారం చుట్టింది.

Published : 08 Dec 2023 04:29 IST

చెత్తకు కాల్చుతుండటంతో పెరుగుతున్న కాలుష్యం..

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామాల్లో వెలువడే చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు డంపింగ్‌ యార్డులు, సేంద్రియ ఎరువుల తయారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈమేరకు పల్లెలు, పట్టణాల్లో ఆగమేఘాల మీద నిర్మాణాలు పూర్తి చేయించారు. కానీ వినియోగంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ తంతు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, కాగజ్‌నగర్‌ పురపాలికలో 30 వార్డులు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డు నిర్మాణం కోసం రూ.2.50 లక్షలు చొప్పున నిదులు కేటాయించగా.. నిర్మాణాలు పూర్తి చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ కోసం రెండేసి చొప్పున ప్లాస్టిక్‌ బుట్టలు పంపిణీ చేశారు. దీంతోపాటు ప్రతి పంచాయతీకి చెత్త తరలించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. నిత్యం తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి దాన్ని డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి.. తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారైన ఎరువును పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు వాడాలి. పొడి చెత్తలో ఇనుము, ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించి ఆ డబ్బులను పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నిండా నిర్లక్ష్యం..

తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు పంచాయతీ ప్రత్యేక నిధులతో వానపాములను కొనుగోలు చేయించారు. వాటిని వినియోగించి ఎరువు తయారు చేయాలి. అయితే నిర్వహణ లేక చాలా వరకు నిరుపయోగంగా మారాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించక పోవడం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించక పోవడంతో.. మొత్తం చెత్తను ట్రాక్టర్లలో సేకరించి డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి సమీపంలోనే పడేస్తున్నారు. చాలావరకు గ్రామాల్లో యార్డులు నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను సమీపంలో పడేయడం తర్వాత నిప్పుపెడుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది. నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు.

పురపాలికలో ఇలా..

కాగజ్‌నగర్‌ పురపాలికలోని 30 వార్డులు ఉండగా.. ప్రతి రోజు దాదాపు 20 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. 152 మంది పారిశుద్ధ్య కార్మికులు 15 ఆటో ట్రాలీలు, 5 ట్రాక్టర్లతో పట్టణ శివారులోని కాగజ్‌నగర్‌ మండలం కోసిని, సర్‌సిల్క్‌ ఏరియాల్లోని డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. సర్‌సిల్క్‌ ఏరియాలో చెత్తతో ఎరువు తయారీకి రూ.కోటి వ్యయంతో రెండేళ్లగా షెడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతో చెత్తకు నిప్పంటిస్తున్నారు.

నిర్మాణ పనులు సాగుతూ..

కాగజ్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సర్‌సిల్క్‌ ఏరియాలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేకంగా రూ.కోటి నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల కిందట షెడ్డు నిర్మాణ పనులు చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఫలితంగా పట్టణంలోని చెత్తాచెదారాన్ని డంపింగ్‌ యార్డులకు తరలించి నిప్పంటిస్తున్నారు. వెలువడే పొగ కారణంగా కాలుష్యం పెరుగుతోంది.

నిరుపయోగంగా..

కాగజ్‌నగర్‌ మండలంలోని కోసిని గ్రామ పంచాయతీ సమీపంలో డంపింగ్‌ యార్డు నిర్మాణం చేపట్టారు. అయితే వినియోగించడం లేదు. దాని సమీపంలోనే చెత్తాచెదారాన్ని పడేస్తున్నారు. దీంతోపాటు చింతగూడలోని డంపింగ్‌యార్డు రేకుల షెడ్డు.. ఇటీవలి గాలులకు కూలిపోయింది. దీంతో గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని యార్డు సమీపంలోనే ఇష్టానుసారంగా పడేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని