logo

పెట్టుబడి కష్టమే..

ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలదాడి, కూలీల లేమితో పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా సుమారు 17 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా తదితర పంటలు సాగు చేశారు.

Published : 08 Dec 2023 04:34 IST

ఆందోళనలో రైతన్నలు

తాండూరులో ఒక్కసారి కూడా పత్తి తీయని చేను

తాండూరు, తిర్యాణి న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలదాడి, కూలీల లేమితో పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా సుమారు 17 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా తదితర పంటలు సాగు చేశారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడులు సాధిస్తామని ఆశించారు. కానీ ఎన్నికలు, వాతావరణ పరిస్థితులు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. కొంత మంది ఆశించినంత ధర లేకపోవడంతో సేకరించిన పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో పత్తి రంగు మారి ఇప్పుడు వస్తున్న రేటు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కల్లాలో ఉన్న ధాన్యం తడిసిపోతే సగం ధర కూడా రాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలంటే సుమారు రూ.35 వేలు, ఎకరంలో వరి సాగు కు రూ.30 వేల వరకు ఖర్చు వస్తోంది. పరిస్థితులను బట్టి మరో రూ.5 వేలు అధికంగా ఖర్చయ్యే అవకాశముంది. పత్తితీత, వరికోతలు పూర్తికాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసిన పత్తిని విక్రయించుకుందామన్నా క్వింటా రూ.7 వేలు పలుకుతుండటంతో ఇళ్లలోనే నిల్వ ఉంచుకుంటున్నారు.

పక్క రాష్ట్రం నుంచి కూలీలు..

జిల్లా రైతన్నలకు ఈ ఏడాది కూలీల కష్టం వచ్చి పడింది. ఎన్నికల నేపథ్యంలో అది ఇంకా పెరిగింది. ఒక్కో రైతు మొదటి దఫా పత్తి తీయడానికి కూలీలు దొరక్కపోవడంతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పత్తి తీత పనులు ప్రారంభించలేకపోయారు. చేసేదేమీ లేక మహారాష్ట్ర నుంచి కూలీలను తెప్పించుకుని పత్తి తీత పనులు చేయించుకుంటున్నారు. అయితే వారు అక్కడి నుంచి రావడం ఆలస్యం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

సేకరించింది 30 శాతమే..

జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా పత్తి తీసే పనులు 30 శాతాన్ని మించలేదు. మిగతా 70 శాతం మొక్కలపైనే ఉంది. పత్తి తీసే సమయంలో ఎన్నికలు రావడంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. స్థానికంగా ఉండే కూలీలను ఆయా పార్టీల నేతలు ప్రచారాలు, సభలకు రోజు వారీ కూలీ ఇచ్చి తరలించారు. దీంతో పత్తి తీత పనులు వెనకబడ్డాయి. ఎన్నికలు తర్వాత మిగ్‌జాం తుపానుతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి నేలరాలుతూ రంగు మారుతోంది. దీనికితోడు గులాబి రంగు పురుగు ఆశిస్తోంది.

ఈ సారీ నష్టపోయినట్లే..

గాజుల నగేష్‌, నగరం, తాండూరు

నాకున్న ఒక ఎకరం సొంత చేనుతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. కలుపు అధికంగా ఉండటం వాతావరణ మార్పులతో చీడపీడలు సోకినందున పెట్టుబడి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. 5 ఎకరాలకు సుమారు రూ.1.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నందుకు మరో రూ.25 వేలు అదనం అయింది. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొచ్చి కిలోకి రూ.10 ఇచ్చి పత్తిని తీయిస్తున్నాం.

కల్లాల్లోనే ధాన్యం..

జిల్లాలో ప్రధానంగా సాగు చేసేది వరి పంటనే.. ప్రస్తుత ఏడాది ఆలస్యంగా నాట్లు వేయడం ఆయా ప్రాంతాల్లో ఆకుముడత, సుడిదోమ తెగులు ఆశించినప్పటికీ పంట దిగుబడి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సుమారు 40 శాతం కోతలు అయ్యాయి. చాలా వరకు వరి ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తక్కువ ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.2,500 నుంచి రూ.2,750 వరకు ధర పెట్టి కొనుగోలు చేసినా.. డబ్బులు చెల్లించేందుకు రెండు నెలల గడువు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని