logo

తల్లుల చెంత.. తరాల పులకింత..!

వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది. 

Updated : 23 Feb 2024 05:40 IST

వన దేవతలకు తీరొక్క మొక్కులు
న్యూస్‌టుడే, మేడారం (డోర్నకల్‌)

వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది.  తల్లుల చెంత కొంత సమయం గడిపేందుకు వృద్ధుల్లో చైతన్యం ఉరకలేస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా పసికందు మొదలు వృద్ధుల వరకు అమ్మల దర్శనంతో తన్మయత్వం చెందుతున్నారు. మేడారంలో ఎవరిని చూసినా సమ్మక్క, సారలమ్మల నామస్మరణే.. ఆధ్యాత్మిక చింతనే..

వన దేవతల దర్శనానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా    నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, జంపన్న వాగు వద్ద ముడుపులు కడుతున్నారు. సంతానం కోసం ఊయల, సుమంగళిగా వర్ధిల్లాలని గాజులు మొక్కుగా సమర్పిస్తున్నారు.  ఎదురుకోడి, కోడె, చిల్లర నాణేలు, గంట, ఎత్తుబెల్లం(బంగారం), ఒడిబియ్యం, తలనీలాలు, తదితర మొక్కులు చెల్లిస్తున్నారు.


జాతర ప్రత్యేకతలు

  • గురువారం మేడారంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చారు. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు భక్తులు బారులు తీరారు.
  • మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో కోయ గిరిజనుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30కి పైగా ఇలవేల్పులను ఆయా వంశస్థులు ఒకే చోటుకు చేర్చారు. పగిడలతో ఆదివాసీ నృత్యాలు చేశారు. ఇలవేల్పులకు పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
  • జంపన్నవాగులో ఒక్కరోజే దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
  • వనదేవతలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితతో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి


అమ్మల జ్ఞాపిక.. ఆసక్తికరం

న్యూస్‌టుడే, మేడారం (కాజీపేట): మేడారం జాతర గుర్తుగా ప్రముఖులకు అందించే జ్ఞాపికను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా రూపొందించింది. గాజుగ్లాస్‌ ఫ్రేములో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటి మీద చెట్టు మొదళ్లకు కట్టిన చీరలతో కూడిన రూపాన్ని తయారు చేశారు. గురువారం సమ్మక్క దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి సీతక్క దీన్ని బహూకరించారు.


హెలికాప్టర్‌లో వెళ్లొద్దామా..

న్యూస్‌టుడే, కాజీపేట టౌన్‌: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర చూసి, తల్లులను దర్శించుకోవడానికి కాజీపేట సెయింట్‌ గాబ్రియల్‌ పాఠశాల నుంచి గురువారం హెలికాప్టర్‌ ద్వారా భక్తులు తరలి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి కాజీపేటకు చేరుకున్న హెలికాప్టర్‌ అప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకున్న ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందినవారిని మేడారానికి తీసుకెళ్లింది. గాలిలోకి ఎగిరిన అనంతరం 15 నిమిషాల్లో మేడారానికి చేరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీ రూ.28,999. మేడారం అందాలను వీక్షించడానికి రూ.4,800 టికెట్‌ నిర్ణయించారు. హెలికాప్టర్‌ రోజుకు కేవలం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే మేడారానికి వెళ్లగలదని తుంబే ఏవియేషన్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని