logo

ఇందిరమ్మ స్థలం భారాస నేత పేరిట పట్టా

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని పంచాయతీ పరిధిలోని బారెపల్లిలో ఇందిరమ్మ స్థలాలను భారాస మండల అధ్యక్షుడు తన పేరిట తిరిగి పట్టా చేయించుకున్నారు.

Updated : 03 Apr 2024 06:39 IST

ఇందిరమ్మ స్థలం భారాస నేత పేరిట పట్టా

తాండూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న శ్రీనివాస్‌

తాండూరు, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని పంచాయతీ పరిధిలోని బారెపల్లిలో ఇందిరమ్మ స్థలాలను భారాస మండల అధ్యక్షుడు తన పేరిట తిరిగి పట్టా చేయించుకున్నారు. అయితే కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని తాండూరు మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం.. 2007లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తాండూరు మండలం రేచిని గ్రామ పంచాయతీ పరిధి బారెపల్లిలోని సర్వే నెంబర్‌ 41/ఆ లో 1.17 ఎకరాలు, 45/ఆ లో 1.25 ఎకరాల భూమిని యజమాని అయిన భారాస మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సుబ్బ దత్తుమూర్తి, దోకె లక్ష్మిల నుంచి కొనుగోలు చేసింది. ఆ స్థలాల్లో ఎవరూ ఇళ్లు నిర్మించుకోలేదు. స్థలం ఖాళీగా ఉండటంతో భారాస మండల అధ్యక్షుడు దత్తుమూర్తి 1.17 ఎకరాలపై కన్నేశారు. 2021లో రాజకీయ పలుకుబడితో ఆయన తన పేరిట అక్రమంగా పట్టా చేయించుకున్నారు. రైతు బంధు పొందుతూ తమకు అన్యాయం చేశారు. ఈ విషయమై బాధితులు తాండూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సమయంలోనే ఆదె శ్రీనివాస్‌ అనే బాధితుడు తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై జగదీష్‌గౌడ్‌, ఏఎస్సై లక్ష్మణ్‌ను సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్‌ను వారించారు. తహసీల్దారు కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దారు ఇమ్రాన్‌ఖాన్‌తో చరవాణిలో మాట్లాడించి ఫిర్యాదును కార్యాలయంలో అందించాలని సూచించారు. దానిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని