logo

జగన్‌ వీరబాదుడుకు ఇదే సాక్ష్యం

నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన శెట్టి భగవానులు 2019 మే నెలలో 110 యూనిట్లు విద్యుత్తు వినియోగించారు. కస్టమర్‌ ఛార్జీలతో కలిపి రూ.373 బిల్లు ఇచ్చారు.

Updated : 12 Apr 2024 08:48 IST

 విద్యుత్తు బిల్లు చూస్తేనే వినియోగదారులకు షాక్‌
 ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీలతో రూ. 964 కోట్ల అదనపు భారం

 నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన శెట్టి భగవానులు 2019 మే నెలలో 110 యూనిట్లు విద్యుత్తు వినియోగించారు. కస్టమర్‌ ఛార్జీలతో కలిపి రూ.373 బిల్లు ఇచ్చారు. అదే వినియోగదారుడు 2023 అక్టోబర్‌లో 117 యూనిట్లు విద్యుత్తు వినియోగించగా రూ.574 కరెంటు బిల్లు వచ్చింది. విద్యుత్తు వినియోగం దాదాపు ఒకేలా ఉన్నా అప్పటికి, ఇప్పటికి బిల్లులో చెల్లించాల్సింది రూ.201 పెరిగింది. అప్పుడు 1-50 యూనిట్ల వరకు ఒకటే స్లాబు ఉండేది. ఇప్పుడు 1-30 వరకు ఒకటి, 30-75 యూనిట్ల వరకు మరో స్లాబు మార్చడంతో వినియోగ ఛార్జీలు పెరిగాయి. వీటికి అదనంగా ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు కలపడంతో భారం మరింత పెరింగింది. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ గుండెలు బాదేసుకున్న జగన్‌ అధికారంలోకి వచ్చాక వడ్డించిన వీర బాదుడుకు నిదర్శనమిదే..

ఈనాడు, అనకాపల్లి, పాడేరు: వైకాపా సర్కారు అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం భారీగా మోపింది. కొన్ని వర్గాల కనెక్షన్లకు సంబంధించి టారిఫ్‌లో మార్పులు చేయకపోయినా స్లాబులు మార్చి దొడ్డిదారిన ఛార్జీలు పెంచేశారు. వీటికి అదనంగా 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేశారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి రెండు విడతల ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) ఛార్జీలను వడ్డిస్తున్నారు. సామాన్యుల విద్యుత్తు బిల్లులో ఈ వడ్డింపులే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటున్నాయి. అదే పారిశ్రామిక, వాణిజ్య వర్గాల బిల్లుల్లో అదనపు సుంకాలు రూ.వేలల్లో దాటిపోతున్నాయి. కరెంటు బిల్లులు చూస్తేనే షాక్‌ కొట్టేలా ఉన్నాయి. ఒక్క 2023-24లో విశాఖ సర్కిల్‌ పరిధిలోని ఉమ్మడి జిల్లా వినియోగదారులపై రూ.964 కోట్ల అదనపు భారం మోపారు.

అదనంగా వడ్డించేశారిలా..

 ట్రూఅప్‌ ఛార్జీలు యూనిట్‌కు 17 పైసలు చొప్పున సర్కిల్‌ మొత్తం వినియోగంపై నెలకు రూ.11.9 కోట్లు వసూలు చేశారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి రూ.202.3 కోట్లు వసూలు చేశారు.

 ఎఫ్‌పీపీసీఏ-2 పేరుతో  2023 మే నుంచి యూనిట్‌కు 40 పైసల చొప్పున మరో భారం మోపుతున్నారు. సర్కిల్‌లో నెలకు సగటున 70 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన 40 పైసలు చొప్పున నెలకు రూ.28 కోట్లు అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి రూ.28 కోట్ల చొప్పున రూ.336 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సిందే.

ఈ ఏడాది ఎన్నికలున్నాయని పెంపు జోలికి పోలేదు. డిస్కంలు మరో రూ.7 వేల కోట్లు ట్రూఅప్‌ వసూలుకు ఏపీఈఆర్సీ వద్ద ప్రతిపాదనలు పెట్టాయి. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి సిద్ధంగా ఉంచారు.

బిల్లుల భారంపై వామపక్షాల నిరసన (పాత చిత్రం)

2019లో భగవానులకు వచ్చిన విద్యుత్తు బిల్లు  రూ.373

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని