logo

ఎత్తిపోతలపై నిర్లక్ష్యం

ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటినందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

Published : 13 Apr 2024 01:24 IST

నిర్వహణకూ నిధులివ్వని ప్రభుత్వం

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటినందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం నిర్వహణ నిధులు కూడా విడుదల చేయకపోవడంతో పథకాలు  మరమ్మతులకు గురై నిరుయోగంగా మారాయి. దీంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో గిరిజన రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందజేసేందుకు 29 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వీటిలో 25 పథకాలు మరమ్మతుకు గురై నిరుపయోగంగా మారాయి. దీంతో పొలాలకు సాగునీరు అందక వర్షధారంతో పంటలు సాగుచేస్తూ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

స్పందించని ప్రభుత్వం

ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మోటార్లు కాలిపోయాయని, మరమ్మతులకు గురయ్యాయని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పథకాలు ఏర్పాటు చేయడం వరకే తమ వంతని, నిర్వహణ మీరే చూసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల కోసం ఏటా ప్రతిపాదనలను పంపిస్తున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ విడుదల చేయడంలేదు.


నాలుగేళ్లుగా నిరుపయోగం

-ఇల్లా సోమాలమ్మ, రైతు, పెదగెద్దాడ

పెదగెద్దాడ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురై నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారింది. దీంతో నాకున్న అయిదెకరాల భూమిలో వర్షాకాలంలో (ఖరీఫ్‌)లో మాత్రమే అరటి తోటలతోపాటు కూరగాయాలను సాగు చేస్తున్నాం. సాగునీరు కావాలంటే నిమ్మన కాలువ చెక్‌డ్యామ్‌ నుంచి లేదంటే కాలువ నుంచి మోటారు పెట్టుకుని నీటిని తోడుకుంటున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని