logo

తల్లీబిడ్డ వాహనం కోసం అయిదు గంటల నిరీక్షణ

ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కోసం బాలింత అయిదు గంటలపాటు భోజనం లేకుండా నిరీక్షించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేటుచేసుకుంది.

Updated : 13 Apr 2024 05:29 IST

పాడేరు, న్యూస్‌టుడే: ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కోసం బాలింత అయిదు గంటలపాటు భోజనం లేకుండా నిరీక్షించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేటుచేసుకుంది. అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ చీడివలస గ్రామానికి చెందిన కిల్లో వసంత ఈనెల 8వ తేదీన ఉదయం అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో మార్గమధ్యలో నడిరోడ్డుపై ప్రసవించింది. తల్లీబిడ్డను పాడేరు జిల్లా ఆసుపత్రిలోని శిశు సంరక్షణ కేంద్రానికి అదేరోజు తీసుకొచ్చారు. శుక్రవారం వీరిని డిశ్ఛార్జి చేశారు. గ్రామానికి చేరేందుకు తల్లీబిడ్డ వాహనం ఏర్పాటు చేయాలని బాలింత భర్త భాస్కరరావు వాహన డ్రైవర్‌ను అడిగారు. వాహనం ఇవ్వడానికి అవకాశం లేదని ఆయన చెప్పారు. దీంతో వారు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవింద్‌ను సంప్రదించారు. ఆయన ఆసుపత్రి పర్యవేక్షకులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. మళ్లీ భాస్కరరావు డ్రైవర్‌ను కలవగా.. డీజిల్‌ లేదు, తర్వాత రోజు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటికే మధ్యాహ్నం భోజనం లేదు. ఆసుపత్రిలో బెడ్‌ ఖాళీ చేశారు. వరండాలో కూర్చుని వారు ఎదురుచూశారు. బాలింతతోపాటు మరో పాప, భర్త పస్తులతో ఉన్నారు. వారి వద్ద ఇంటికి వెళ్లేందుకు చిల్లిగవ్వ కూడా లేదు. ఈ విషయంపై సాయంత్రం ఐదు గంటల సమయంలో ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌కు ఫిర్యాదు చేశారు. పీఓ స్పందించి ఆసుపత్రి పర్యవేక్షకులతో మాట్లాడి తప్పనిసరిగా అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని