logo

నిధులు లాగేశావ్‌.. సమస్యలు వదిలేశావ్‌

కేంద్ర ప్రభుత్వం ఏటా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. తెదేపా ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేవారు.

Published : 13 Apr 2024 01:31 IST

పారిశుద్ధ్య పనులెలా జగన్‌?
మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే

కేంద్ర ప్రభుత్వం ఏటా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. తెదేపా ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేవారు. వీధి దీపాల నిర్వహణ, కాలువల్లో పూడికతీత తొలగింపు, దోమల నివారణకు ఈ నిధుల నుంచే ఖర్చు చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్‌ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాలకు జమ కాగానే సర్పంచులకు తెలియకుండానే లాగేసుకుంటున్నారు. దీంతో పంచాయతీ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. వీధి దీపం వెలగకపోతే కొత్తది వేసేందుకూ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులు పంచాయతీల్లో నెలకొన్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది.

  • వేసవిలో ఎండ తీవ్రతతో ఇంట్లో ఉక్కపోత భరించలేక బయటకు వస్తే.. దోమలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో రాత్రుళ్లు కంటిమీద కునుకు ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు. మాడుగుల, కేజే పురం, ఒమ్మలి, పోతనపూడి, ఎం.కోడూరు. కింతలి వల్లాపురం తదితర గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండటం, మురుగు కాలువలు పూడికతో నిండటంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. కాలువల్లో మురుగు ప్రవాహానికి అడ్డంకుల వల్ల పలుచోట్ల నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. ఎటు చూసినా మురుగు నిల్వలు పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. సమస్య పరిష్కారానికి పంచాయతీ పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
  • వైకాపా ప్రభుత్వం ప్రతి గ్రామానికి గ్రీన్‌ అంబాసిడర్లను నియమించింది. వీరు రోజు  వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణతోపాటు కాలువల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం వీరికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో వారు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. గ్రామ పంచాయతీతోపాటు వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మురుగు కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మలాథియాన్‌ ద్రావణం పిచికారీ చేయాలి. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించాలి. ఫాగింగ్‌ చేసేందుకు గతంలో పంచాయతీలకు అందజేసిన యంత్రాలు వినియోగంలో లేక మూలకు చేరాయి.

చెత్త కుండీలు నిర్వహణ ఇలాగేనా..

నర్సీపట్నం అర్బన్‌:  పురపాలక సంఘంలో చెత్త కుండీల (కాంపాక్టర్‌ బిన్స్‌) నిర్వహణ ప్రహసనంగా మారింది. చాలా చోట్ల వీటిని బోర్లించి ఉంచుతున్నారు. దీంతో జనం చెత్త ఎక్కడ వేయాలో తెలియక వాటి వద్దనే బయట పడేస్తున్నారు. దీంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. గుర్రాల రోడ్లో రెండు కుండీలను బోర్లించి ఉంచారు. ఇలాంటివి పట్టణంలో దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తున్నాయి. స్వచ్ఛతలో రెండుసార్లు పురస్కారాలు పొందిన పట్టణంలో రెండేళ్లుగా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం స్థానికులను కలవరపరుస్తోంది.  


ప్రభుత్వానిదే ఈ పాపం

- ఉండూరు రాజు, భాజపా మండల అధ్యక్షుడు, మాడుగుల

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను జగన్‌ ప్రభుత్వం లాగేసుకుంది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు పంచాయతీ ఖాతాలో నిధుల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దోమలు వృద్ధి చెందకుండా మందు పిచికారీ చేయించడం, నివారకు ఫాగింగ్‌ చేయించడం, కాలువల్లో పూడిక తీయించి బ్లీచింగ్‌ చల్లించే పనులు పంచాయతీల్లో ఎక్కడా జరగడం లేదు. సర్పంచులను అడిగితే నిధుల్లేవని చెబుతున్నారు. దీనికంతటికీ జగన్‌ ప్రభుత్వమే కారణం.


జ్వరాలు ప్రబలితేనే..

- కె.మాలంనాయుడు, వైద్యాధికారి, కింతలి పీహెచ్‌సీ

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కింతలి పీహెచ్‌సీ పరిధిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ జ్వరాలు ప్రబలిన గ్రామాల్లోనే వైద్యారోగ్య శాఖాపరంగా దోమల నివారణకు చర్యలు చేపడుతున్నాం. మిగతా గ్రామాల్లో పంచాయతీ అధికారులే దోమల సంతతి వృద్ధి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని