logo

జాతీయ రహదారిలో హాహాకారాలు

జాతీయ రహదారిలపై శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వాహనాలు వెళ్తున్నాయి.. రహదారికి పక్కగా ఉన్న సంచార ఫలహార వాహనం వద్ద పలువురు తమ వాహనాలు ఆపి అల్పాహారం చేస్తున్నారు.

Published : 13 Apr 2024 01:35 IST

ఉల్కిపడ్డ జనం
అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే

జాతీయ రహదారిలపై శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వాహనాలు వెళ్తున్నాయి.. రహదారికి పక్కగా ఉన్న సంచార ఫలహార వాహనం వద్ద పలువురు తమ వాహనాలు ఆపి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం.. ఏమైందని తేరుకునేలోగా కంటి ముందు బీభత్సం.. తమ వారికి ఏమయ్యిందో అంటూ ఇక్కడి ఉన్న ఉన్న వారు చేసిన హాహాకారాలు మిన్నంటాయి.  

శింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరోతరగతి చదువుతున్న 12 ఏళ్లు బాలుడిని విగతజీవిగా మార్చగా, 10 మందిని గాయాల పాలు చేసింది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సులో సుమారు 35 మంది విద్యార్థులు విశాఖపట్నం నుంచి మాకవరపాలెంలో కళాశాలకు వెళ్తున్నారు. బయ్యవరం వద్ద బస్సు డ్రైవర్‌ అమితవేగంతో వాహనాన్ని నడిపి అదుపుచేయలేక రహదారికి పక్కగా ఉన్న పలహారాలు విక్రయించే వాహనంపైకి దూసుకెళ్లడంతో   కొత్తపల్లి, బుచ్చెయ్యపేట, బయ్యవరం గ్రామాలకు చెందిన 10 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే బస్సులో ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ పిల్లలకు ఏమైందోనన్న ఆందోళనతో చరవాణుల్లో సమాచారం తెలుసుకున్నారు. అనంతరం బస్సు ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అమితవేగమే ప్రమాదానికి కారణమని కశింకోట సీఐ వినోద్‌బాబు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా రోడ్డు పక్కన పలహారం తిన్నందుకు తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.


బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కశింకోట బయ్యవరం వద్ద శుక్రవారం జరిగిన అవంతి బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కూటమి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణతో కలసి పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వం, అవంతి కళాశాల యాజమాన్యం మృతిని కుటుంబానికి, గాయపడిన వారికి తక్షణమే పరిహారం అందించాలన్నారు. కూటమి తరఫున బాధితులను ఆదుకుంటామన్నారు. తక్షణమే ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు అండగా ఉంటామన్నారు. రిత్విక్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని