logo

సమరానికి సమయం నెలే

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేనాటికి పోలింగ్‌కు 58 రోజులు గడువు ఉంది. అబ్బో ఎన్నిరోజులో అనుకున్నారు. అందులో 28 రోజులు అప్పుడే గడిచిపోయాయి. తుది సమరానికి ఇంకా 30 రోజులే గడువు ఉంది.

Published : 13 Apr 2024 01:37 IST

మే 13న పోలింగ్‌
జుకుంటున్న ప్రచార వేడి
జిల్లాలో చంద్రబాబు, జగన్‌ పర్యటనలు ఖరారు
ఈనాడు, అనకాపల్లి

న్నికల షెడ్యూల్‌ ప్రకటించేనాటికి పోలింగ్‌కు 58 రోజులు గడువు ఉంది. అబ్బో ఎన్నిరోజులో అనుకున్నారు. అందులో 28 రోజులు అప్పుడే గడిచిపోయాయి. తుది సమరానికి ఇంకా 30 రోజులే గడువు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెలు లబ్‌‘డబ్బు’ లబ్‌‘డబ్బు’ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. ఓ వైపు గ్రామాల్లో ప్రచారాలు చేస్తూ మరో వైపు వివిధ వర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నేతలంతా తీరిక లేకుండా గడుపుతున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి నేతలంతా కదనోత్సాహంతో ముందుకు వెళుతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఇంకా ప్రలోభాల్లోనే మునిగితేలుతున్నారు.

ఈ నెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన తమ పేరు బలాలు చూసుకుని మంచి ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న నర్సీపట్నం నుంచి తెదేపా అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ నామినేషన్‌ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. మిగతా నేతలు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.


అధినేతల పర్యటనలతో ప్రచార వే‘ఢి’

సార్వత్రిక సంగ్రామం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేయడానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనకాపల్లిలో పర్యటించి తెదేపా, జనసేన, భాజపా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కూడా ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. పాయకరావుపేట, చోడవరంలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున 20న జిల్లాలో సీఎం జగన్‌ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి బస్సు యాత్ర చేపట్టి చోడవరంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇద్దరు అధినేతలు పాయకరావుపేట, చోడవరంలలో వారం వ్యవధిలోనే పర్యటించడంతో రాజకీయ వేడి పెరగనుంది. వీరి తర్వాత ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు తరఫున సేనాని పవన్‌ మరోసారి జిల్లాకు రానుండడంతో ప్రచార వే‘ఢి’ రాజుకోనుంది.


ఇంటింటా ప్రచారాలకే మొగ్గు..

న్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. పోలింగ్‌ సమీపిస్తుండడంతో ప్రచారాలను పరుగులుపెట్టిస్తున్నారు. గత కొన్నిరోజులు ఎండలు తీవ్రత పెరగడంతో ఇరు పార్టీలు ఇంటింటా ప్రచారానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల బాటపడుతున్నారు. 10 గంటలకల్లా ప్రచారాలు పూర్తిచేసుకుంటున్నారు. ఆ తర్వాత ముఖ్యనాయకులతో సమీక్షలు జరుపుతూ గెలుపు వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ నేతలు వాలంటీర్లతో అసమ్మతి నేతలకు రాయబేరాలు పెడుతున్నారు. విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులకు బేరాలు పెడుతున్నారు. ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల నేతలకు అధికార పార్టీ గాలం వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని