logo

తలరాతలు మార్చేది ఇలాగేనా జగన్‌?

అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం.

Published : 13 Apr 2024 01:47 IST

ఇంటర్‌ ఫలితాల్లో అట్టడుగున స్థానాల్లో..
పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే

మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించాలి.. అందుకోసమే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం. రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల తలరాతలు మార్చుతున్నాం
సీఎం జగన్‌ తరచూ చెప్పే మాటలివి.
ఆయన దృష్టిలో స్కూళ్లు, కాలేజీ భవనాలకు రంగులు వేస్తే విద్యార్థుల తలరాతలు  మారిపోతాయనుకున్నారేమో.

వసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం. గతేడాది వరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వగా ఈ ఏడాది 26 జిల్లాల వారీగా విడుదల చేశారు. అందులో అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలిచి నిరాశపరిచాయి. ఎప్పటిలానే ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు.

అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 48 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 70 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై 20వ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కంటే గిరిజన గురుకులాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం తదితర కారణాలు ఉత్తీర్ణత శాతంపై తీవ్రంగా ప్రభావం చూపాయి.


బాధ్యులెవరు?

జిల్లావ్యాప్తంగా 22 మండలాలు ఉన్నాయి. వీటిలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రధాన సమస్యలపై దృష్టి సారించి సరిదిద్ది ఉంటే ఇంత దారుణంగా ఫలితాలు ఉండేవి కాదు. ప్రధానంగా అధ్యాపకుల కొరత కారణంగా అతిథి అధ్యాపకులతో నెట్టుకొచ్చారు. వారికి సకాలంలో వేతనాలు చెల్లించలేదు.  ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కేవలం ఒక్కరు మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉండేవారు. వారు కూడా ప్రిన్సిపల్‌ బాధ్యతలు స్వీకరించడంతో వారి సబ్జెక్టును పిల్లలకు బోధించేందుకు సమయం దొరకని పరిస్థితి. ఒక్కో కశాశాలలో పరిమితికి మించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, ఆపై వారికి బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడంతో సిలబస్‌ పూర్తి చేయలేదు. పాఠ్య పుస్తకాలు సైతం సకాలంలో అందలేదు.  


హై స్కూల్‌ ప్లస్‌లో జీరో శాతం  

దేవీపట్నం: దేవిపట్నం మండలం ముసినిగుంట  బాలికల పాఠశాల్లో హై స్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ ప్రథమ ఫలితాల్లో 14 మందికి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 19 మందికి గాను ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు.  అడ్డతీగల, వీఆర్‌ పురం(రేఖపల్లి), వై.రామవరం తోటకూరపాలెం కాలేజీల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.

అప్పర్‌ సీలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 31 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయగా 11 మంది ఉత్తీర్ణులయ్యారు. 38.48 శాతం మాత్రమే నమోదైంది. నెల్లిపాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 16 మందికి ఒక్కరు మాత్రమే పాసయ్యారు.


మొదటి సంవత్సరంలోనూ...

జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. అరకులోయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 233 మంది విద్యార్థులకు 222 మంది హాజరు కాగా.. కేవలం 19 మంది మాత్రమే పాస్‌ అయ్యారు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 8.56గా నమోదైంది. హుకుంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 229 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇక్కడ 50 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 21.83 శాతంగా నమోదైంది. అప్పర్‌ సీలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 44 మందికి తొమ్మిది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 20.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వై.రామవరం కేజీబీవీలో 15 మంది హాజరు కాగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల హైస్కూల్‌ ఫ్లస్‌లలో ఒక్కరు కూడా పాస్‌ కాకపోవడం గమనార్హం. ఇక్కడ ఒక్కో చోట నలుగురు విద్యార్థులు చొప్పున హాజరు కాగా.. ఒక్కరూ ఉత్తీర్ణులవ్వలేదు. రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 140 మందికి 17 మంది మాత్రమే పాసయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని